పేదల మనసు గెలిచిన డాక్టర్‌

4 Oct, 2021 03:28 IST|Sakshi

ప్రతిఫలం ఆశించకుండా పని చేసేవారు

హస్తవాసి మంచిదని నాలుగు జిల్లాల నుంచి వచ్చేవారు

డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్‌ విజయమ్మ

సాక్షి, కడప: డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి తన సేవలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి చిరస్మరణీయులుగా నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో ఆదివారం ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని ఎప్పుడూ వైఎస్సార్‌ చెప్పేవారన్నారు. అలాంటి వారు సమాజంలో ఒక గుర్తింపు కలిగి ఉంటారని, వారు ఈ లోకంలో లేకపోయినా వారు చేసిన పనులు, ప్రజలతో మెలిగిన తీరును కలకాలం ప్రజలు కీర్తిస్తూనే ఉంటారని వివరించారు. గంగిరెడ్డి అన్నలో తనకు.. క్రెడిబులిటీ, కమిట్‌మెంట్, కరేజ్, కేర్, కన్సర్న్‌ లక్షణాలు ప్రధానంగా కనిపించాయని, ఆయనలో ఇంకా అనేక మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు.

అందరికీ వారధి 
అన్న గంగిరెడ్డి, సుగుణమ్మ దంపతులిద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని వైఎస్‌ విజయమ్మ చెప్పారు. బంధాలకు, అనుబంధాలకు విలువ ఇస్తారన్నారు. ‘ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వారధిలా వ్యవహరించి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిఫలం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లే వారు. డబ్బు గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇది నా మాట కాదు.. జనం మాట. హస్తవాసి మంచిదని నాలుగు జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం వచ్చే వారు. వారణాసిలో తనకు అత్యంత ముఖ్య స్నేహితుడైన దినేష్‌ను మరచిపోకూడదని తన కుమారుడికి అదే పేరు పెట్టుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్, డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డిల మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది’ అని వివరించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు