వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

4 Aug, 2021 02:35 IST|Sakshi

వివేకా అనుచరుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌ అరెస్టు

పారిపోతుండగా గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ

సాక్షి, కడప అర్బన్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన సునీల్‌కుమార్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. ఈ నెల 2న గోవాలో అతడు పారిపోతుండగా ట్రాన్సిట్‌ అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అతడిని పలుమార్లు సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేశాక అతడిని ప్రత్యేక వాహనంలో బెంగళూరు మీదుగా కడప కేంద్ర కారాగారానికి తరలించింది. అక్కడ సీబీఐ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కార్యాలయానికి సునీల్‌ను తీసుకొచ్చింది. మంగళవారం సాయంత్రం అతడిని కడప కోర్టులో హాజరుపరుస్తారనే ప్రచారం సాగినా రాత్రి వరకు కోర్టుకు తీసుకురా లేదు.

బుధవారం ఉదయం సీబీఐ అధికారులు సునీల్‌ కుమార్‌ను కడప లేదా పులివెందుల లేదా జిల్లాలోని ఏదైనా కోర్టు లేదా మెజిస్ట్రేట్‌ ఎదుట నేరుగా గానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా, కడప కేంద్ర కారాగారంలో ఇదే కేసుకు సంబంధించి వైఎస్‌ వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, ఉమాశంకర్‌ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సునీల్‌తోపాటు ఈ ముగ్గురిని ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని కూడా అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి.

ఎవరీ సునీల్‌కుమార్‌ యాదవ్‌?
పులివెందుల మండలం మోటునూతలపల్లెకు చెందిన కృష్ణయ్య కుటుంబం ప్రస్తుతం భాకారాపురంలో నివాసం ఉంటోంది. కృష్ణయ్య స్థానిక ఆటోఫైనాన్స్‌లో వాటాదారుగా ఉండగా, ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఇసుక రీచ్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో తొండూరు మండలం రావులకొలనులో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డికి సంబంధించిన పొలాలను పర్యవేక్షించే ఉమాశంకర్‌ రెడ్డితో సునీల్‌కు స్నేహం ఏర్పడింది. అతడి ద్వారా వైఎస్‌ వివేకాకు సునీల్‌ కుటుంబం మొత్తం దగ్గరైంది.

ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో తొలుత సిట్, ఆ తర్వాత సీబీఐ సునీల్‌ను, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కిరణ్‌కుమార్‌ను పలు మార్లు విచారించింది. సునీల్‌ను సీబీఐ ఢిల్లీలోని తమ కార్యాలయంలో నెల పాటు ఉంచింది. దీంతో సీబీఐ తనతోపాటు తన కుటుంబ సభ్యులను విచారణకు పిలిపించి వేధిస్తోందని సునీల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనికి సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ వేసింది. హైకోర్టులో పిటిషన్‌ వేసినప్పటి నుంచి గోవాలోనే సునీల్‌కుమార్‌ యాదవ్‌ మకాం వేశాడు. దీంతో విచారణకు సహకరించకపో వడంతో అతడిని అనుమానితుడిగా నిర్ధారించిన సీబీఐ అరెస్టు చేసింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు