YS Viveka Case: వివేకా కేసు విచారణకు నూతన సిట్‌

30 Mar, 2023 04:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) సీబీఐ  ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యుల పేర్లను సీబీఐ అందజేయగా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దర్యాప్తును వేగవంతం చేసి ఏప్రిల్‌ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ను తప్పించింది. వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. నూతన సిట్‌ బృందానికి సీబీఐ డీఐజీ కేఆర్‌ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఎస్పీ వికాస్‌సింగ్, అదనపు ఎస్పీ ముకేష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పూనియా, ఎస్‌ఐ అంకిత్‌ యాదవ్‌ ఉన్నారు. 

ఇలా ఎంతకాలం?
దర్యాప్తు అధికారి మార్పు/కొనసాగింపుపై సీబీఐ డైరెక్టర్‌ నిర్ణయాన్ని వెల్లడించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ తరఫు అదనపు సొలి­సిటర్‌ జనరల్‌ నటరాజన్‌ తాజాగా జాబితాను అందజేశారు. చౌరాసియా నేతృత్వంలోని నూతన సిట్‌­ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఈ సంద­ర్భంగా జస్టిస్‌ ఎంఆర్‌ షా తెలిపారు. ఈ సందర్భంగా దర్యాప్తు ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది.


చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు?

భారీ కుట్ర కారణంగా ట్రయల్‌ కోర్టులో అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు స్వేచ్ఛ కావాలని సీబీఐ కోరడంతో ఇలా ఎంతకాలం సాగదీస్తారని జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ప్రశ్నించారు. ‘విచారణ వేగవంతం చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించాయి. మేం మరోసారి అదే చెబుతున్నాం. బెయిలు పిటిషన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ఏ5 (శివశంకర్‌రెడ్డి) భార్య అనుమతి కోరారు. ఈరోజు నుంచి ఆర్నెళ్ల వరకూ విచారణ ప్రారంభం కాకుంటే రెగ్యులర్‌ బెయిల్‌కు ఏ 5 దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవు. కేవలం మెరిట్స్‌ ప్రకారమే హైదరాబాద్‌లోని ట్రయల్‌ కోర్టు విచారిస్తుంది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది.    

చదవండి: ఏది నిజం.. పచ్చపైత్యం ముదిరిపోయింది.!

మరిన్ని వార్తలు