వైఎస్సార్‌కు స్మృత్యంజలి 

3 Sep, 2020 02:55 IST|Sakshi
ఇడుపులపాయలోని వైఎస్సార్‌ఘాట్‌లో దివంగత మహానేత, తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి తదితరులు

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి  

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్‌ కుటుంబ సభ్యులు

సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వైఎస్‌ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 

బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తున్న సీఎం జగన్, విజయమ్మ, భారతీ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు   

► సీఎం వైఎస్‌ జగన్, ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, తల్లి వైఎస్‌ విజయమ్మ, దివంగత వైఎస్‌ జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, వైఎస్‌ సోదరులు వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ సుధీకర్‌రెడ్డి తదితరులు ఉదయం 8.50 గంటలకు ఘాట్‌ వద్దకు చేరుకున్నారు.  
► పాస్టర్‌ రెవరెండ్‌ నరేష్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ను స్మరించుకోవడంతోపాటు ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. 
► వైఎస్‌ అందించిన విధంగానే ఆయన తనయుడు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదే సందర్భంలో వైఎస్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 
► ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి, వైఎస్‌ జగన్‌ అత్తమామలు ఈసీ సుగుణమ్మ, ఈసీ గంగిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్‌ ఘాట్‌ వద్ద పూల మాలలు ఉంచి అంజలి ఘటించారు. 
► డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌బాషా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రసాద్‌రాజు, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాలరెడ్డి, జకియాఖానమ్, చక్రాయపేట ఇన్‌చార్జ్‌ వైఎస్‌ కొండారెడ్డి, పరిశ్రమల మౌలిక సదుపాయాలు..పెట్టుబడి సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్‌ హరి కిరణ్, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్, జేసీ గౌతమి, వైఎస్‌ స్నేహితుడు అయ్యపురెడ్డి సతీమణి సరళాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
► అందరూ కొద్దిసేపు వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. సమీపంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
► ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ వద్ద పులివెందులకు చెందిన జ్యోతి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతిరెడ్డిలు బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించారు. హెలిప్యాడ్‌ వద్ద  సీఎం ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు బయలుదేరారు.   
పులివెందులకు చెందిన జ్యోతి బిడ్డను ఎత్తుకొని ఆశీర్వదిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు 

మహానేత జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
మహానేత వైఎస్సార్‌ శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. తన తండ్రి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన ట్విట్టర్‌లో... ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు