ఆరోగ్యశ్రీ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

11 Jul, 2021 01:51 IST|Sakshi

పథకం ఆరంభం నుంచి పరిశీలిస్తే గడిచిన 25 నెలల్లోనే ఎక్కువ మందికి లబ్ధి

34 శాతం లబ్ధిదారులు ఈ రెండేళ్లలోనే..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక 11.79 లక్షల మందికి పైగా వైద్యం

బాధితులకు చేసిన వ్యయంలోనూ ఈ రెండేళ్లలోనే ఎక్కువ

రూ.4,244 కోట్లు ఖర్చు చేసిన సర్కారు

చికిత్సల సంఖ్య పెంచడం, కోవిడ్‌నూ ఆరోగ్యశ్రీలో చేర్చడంతో భారీ లబ్ధి

బ్లాక్‌ఫంగస్, మిస్‌–సి జబ్బులనూ పథకంలో చేర్చిన సర్కారు 

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2007లో పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పింది. గడిచిన రెండేళ్లలో ఈ పథకం కనీవినీ ఎరుగని రీతిలో పేదలకు అండగా నిలిచింది. 2007లో పథకం ప్రారంభించినప్పటి నుంచి 2021 జూన్‌ వరకూ 34.84 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందగా.. అందులో సుమారు 34% లబ్ధిదారులు ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే లబ్ధిపొందారంటే అతిశయోక్తి కాదు.

రెండేళ్లలో 11.79 లక్షల మందికి..
2019లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఆరోగ్యశ్రీ పథకంలో పెనుమార్పులు తీసుకువచ్చారు. 
– అప్పటివరకు 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 2,436కు పెంచారు. 
– సూపర్‌స్పెషాలిటీ వైద్యానికి ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రులకూ అనుమతులిచ్చారు. 
– వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆ జబ్బుకు ఆరోగ్యశ్రీలో చికిత్స చేసేలా అవకాశం కల్పించారు. దీంతో గడిచిన 25 నెలల్లోనే 11.79 లక్షల మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. 
– విచిత్రమేమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏడేళ్ల పాటు లబ్ధిపొందిన వారికంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో లబ్ధిపొందిన వారే ఎక్కువ. 
– కరోనా చికిత్సను పథకం పరిధిలోకి తేవడం, కోవిడ్‌ కారణంగా వచ్చే బ్లాక్‌ఫంగస్, మిస్‌–సి వంటి జబ్బులనూ పథకం పరిధిలోకి తీసుకురావడంతో పేద, మధ్యతరగతి వారికి ఆర్థికంగా పెనుభారం తప్పింది.

వ్యయంలోనూ ఇప్పుడే ఎక్కువ
ఇక 2007 నుంచి 2014 వరకూ ఆరోగ్యశ్రీ పథకానికి వ్యయం చేసింది అక్షరాలా రూ.3,976.95 కోట్లు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2019 వరకూ ఉన్నారు. ఆ సమయంలో ఖర్చు చేసింది రూ.5,838.17 కోట్లు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 జూన్‌ నుంచి 2021 జూన్‌ వరకూ 25 నెలల కాలంలోనే 4,244.01 కోట్లు ఖర్చుచేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున రోజుకు 1,572 మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నారు. అలాగే, చికిత్స అనంతరం కోలుకునే సమయంలో ‘ఆసరా’ కింద రోజుకు రూ.225 ఇస్తూండటంతో బాధిత కుటుంబానికి గొప్ప భరోసా లభిస్తున్నట్లయింది. దీనికింద ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి అదనంగా రూ.324కోట్లు చెల్లించింది.

మరిన్ని వార్తలు