నాడు తండ్రి.. నేడు తనయుడు: దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో..

18 May, 2022 11:53 IST|Sakshi
2007లో గణపవరం సభలో మాట్లాడుతున్న దివంగత సీఎం వైఎస్సార్‌ (ఫైల్‌), సీఎం వైఎస్‌ జగన్‌కు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే వాసుబాబు  

నాడు తండ్రి... నేడు తనయుడికి ఆత్మీయ స్వాగతం 

రైతు భరోసా సభలో సీఎం జగన్‌ వరాల జల్లు  

అభివృద్ధికి బాటలు వేసిన నేతలు 

సాక్షి, ఏలూరు(గణపవరం): నాడు తండ్రి వైఎస్సార్, నేడు తనయుడు వైఎస్‌ జగన్‌ అడిగిందే తడవుగా ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. ఇద్దరూ గణపవరం పర్యటనకు వచ్చి సభాముఖంగా వరాలు ఇచ్చారు. పైగా ఇద్దరి సభా వేదిక ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం విశేషం. 2007లో తొలిసారి గణపవరం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గణవపరం ప్రభుత్వ డిగ్రీ కాలేజి ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

గణపవరం డిగ్రీ కాలేజి అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేశారు. గణపవరం మండలంతోపాటు నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి మండలాలకు ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రకాల్వ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాల్వలో పూడిక తీత, ఇరువైపులా గట్లు పటిష్టం చేసి ఒకవైపు బీటీ రోడ్డు, మరోవైపు కంకర రోడ్డు నిర్మించడం, ఆయా గ్రామాల వద్ద ఐదేసి కోట్ల రూపాయలతో వంతెనల నిర్మాణం చేపట్టారు. గణపవరంలో దాదాపు వెయ్యి ఇళ్లతో వైఎస్సార్‌ ఇందిరమ్మ కాలనీ నిర్మాణం ప్రారంభించి, వాటిని మరోసారి వచ్చి ప్రారంభోత్సవం చేశారు. 

చదవండి: (జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ!)

దశాబ్దంన్నర తరువాత అదే ప్రదేశంలో సభ  
ఈనెల 16న గణపవరం వచ్చిన వైఎస్సార్‌ తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అదే ప్రదేశంలో ఏర్పాటుచేసిన సభావేదిక నుంచి ఉంగుటూరు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఈప్రాంతంలో ఆక్వా రైతాంగానికి మేలు చేసేలా యూనిట్‌ విద్యుత్‌ రూపాయిన్నరకే పదెకరాల రైతులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించి ఆక్వా రంగానికి ఊపిరి పోశారు. ఎమ్మెల్యే వాసుబాబు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీ విద్యుత్‌ పరిమితి ఐదెకరాల నుంచి పదెకరాలకు విస్తరించి ఎక్కువ మంది ఆక్వా రైతులకు మేలు చేయాలని కోరగా తక్షణమే ఆమోదిస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు.

దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న గణపవరం బొబ్బిలి వంతెనతోపాటు ఏలూ రు కాల్వపై మరో మూడు వంతెనల నిర్మాణానికి అనుమతించారు. గణపవరం మండలాన్ని భీమవరం డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గంలో ఆరు 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కొల్లేరు రీసర్వే, కొల్లేరులో కాంటూర్‌ నిర్మాణం, కొల్లేరుకు చెందిన 4 గ్రామాల్లో ఏటా తలెత్తే వేసవి దాహార్తిని తీర్చడానికి సమ్మర్‌స్టోరేజి ట్యాంకుల ఏర్పాటు తదితర వాసుబాబు కోరినవన్నీ మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వరాల జల్లుతో ఈ ప్రాంతంపై వైఎస్‌ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అభినాన్ని చాటుకున్నారు.    

మరిన్ని వార్తలు