మీ చలవతో ఉచితంగా నాణ్యమైన వైద్యం

11 Nov, 2020 02:43 IST|Sakshi

మీ పేరు చెప్పుకుని పెద్ద ఆస్పత్రులకు వెళ్లగలుగుతున్నాం

సీఎం జగన్‌తో ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల మనోగతం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీతో ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలకాలం సీఎంగా ఉండాలని ఆ పథకం లబ్ధిదారులు ఆకాంక్షించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించిన సందర్భంగా పలువురు లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయనతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

ఏడుసార్లు కీమో థెరపీ ఉచితంగా చేశారు
కొంతకాలంగా నాకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునేందుకు ఆరోగ్య మిత్రను కలిశాను. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్‌ అని తేలింది. ఏడు దపాలుగా కీమో థెరపీ ఉచితంగా చేశారు. ఉచితంగా ఆపరేషన్‌ కూడా చేశారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద రూ.10 వేలు ఇచ్చారు. మీ మేలు మరచిపోము.
– లక్ష్మీనారాయణ, గోరంట్ల గ్రామం, గుంటూరు జిల్లా 

మీరు చల్లగా ఉండాలి 
నాకు గర్భసంచిలో గడ్డ వుందని వైద్యులు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.50 వేలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకునే శక్తి నాకు లేదు. కడప ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ఇక్కడ వైద్యులు నాకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్‌ చేశారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ఆదుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు చల్లగా ఉండాలి.  
 – రమాదేవి, చక్రాయిపేట మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

ధైర్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాం
నాది మారుమూల గ్రామం. మా పాప వయస్సు నాలుగేళ్లు. ఆడుతూ కింద పడిపోయింది. వైద్యులకు చూపిస్తే వెంటనే ఆపరేషన్‌ చేయాలన్నారు. రూ.50 వేలు అవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ఉండటంతో ధైర్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాం. వెంటనే జాయిన్‌ చేసుకుని, ఉచితంగా ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మా లాంటి పేదలకు ఈ పథకం ఓ వరం. మీ పేరు చెప్పుకుని మేము పెద్ద ఆస్పత్రులకు వెళ్లగలుగుతున్నాం.  
 – మీసాల కృష్ణ, కరకవలస, జలుమూరు మండలం,శ్రీకాకుళం జిల్లా 

మరిన్ని వార్తలు