భరోసా ఇచ్చిన ‘ఆసరా’

14 Oct, 2021 03:04 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో వైఎస్సార్‌ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీకి హాజరైన మహిళలు

మాఫీ చేస్తానని బాబు మోసగిస్తే.. సీఎం జగన్‌ ఆదుకున్నారు 

ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టకాలంలో ఆర్థిక భరోసా కల్పించారు 

ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఇళ్లు వంటి పథకాలలో భారీగా లబ్ధి 

జీవితంపై నమ్మకం పెరిగింది.. బతుకులు బాగుపడ్డాయి 

అందుకే సంబరాలు చేస్తున్నామంటున్న లబ్ధిదారులు

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌: కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బుధవారం పెద్ద షామియానా వేశారు. ప్రాంగణం అంతా రంగు రంగుల బెలూన్‌లు, బంతిపూల తోరణాలతో కళకళలాడుతోంది. కొందరు మహిళలు ముగ్గులు వేస్తోంటే.. మరికొందరు వాటికి రంగులు అద్దడంలో నిమగ్నమయ్యారు. ‘ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదైనా పంక్షనా?’ అని అడిగితే.. ‘అవును.. వైఎస్సార్‌ ఆసరా పండుగ. 2014 ఎన్నికల సమయంలో రుణ మాఫీ చేస్తానని చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక చంద్రబాబు మమ్మల్ని నిలువునా ముంచాడు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాం. డ్వాక్రా సంఘాల్లో చాలా వరకు ఆ దెబ్బతో మూతపడ్డాయి. ఆ సమయంలో పాదయాత్రగా వచ్చిన జగనన్నకు మా కష్టాలు చెప్పుకున్నాం.

ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సీఎం ఆయ్యాక మా అప్పు మొత్తాన్ని 4 విడతలుగా మా చేతిలో పెడుతున్నాడు. గత ఏడాది మొదటి దఫా ఇచ్చారు. ఇప్పుడు రెండో దఫా ఇస్తున్నారు. అన్ని విధాలా జగనన్న మా తల రాత మార్చారు. అందుకే పండుగ చేసుకుంటున్నాం’ అని తెలిపారు. ‘గత ఏడాది మొదటి విడతలో నాకు రూ.10 వేలు వచ్చింది. ఇప్పుడు రెండో దఫా రూ.10 వేలు బ్యాంక్‌ ఖాతాలో జమ కానుంది. మాకు ఆర్థిక భరోసానిచ్చిన వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని మేం సంబరంగా నిర్వహించుకుంటున్నాం.


కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు, ఎమ్మెల్యే

అందుకే ఈ ప్రాంగణాన్ని మేమే స్వయంగా ముస్తాబు చేస్తున్నాం’ అని ఉయ్యూరు మండలం కలాసమాలపల్లికి చెందిన నెహ్రూ గ్రూప్‌ సభ్యురాలు గుమ్మడి చంద్రమ్మ చెప్పింది. ‘గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన రుణంతో రెండు గేదెలు కొన్నాను. వాటి ద్వారా ప్రతి నెలా రూ.10 వేలు సంపాదిస్తున్నాను. చదువుకుంటున్న నా బిడ్డకు అమ్మ ఒడి వచ్చింది. మా అత్త విజయలక్ష్మికి వైఎస్సార్‌ చేయూత సాయం అందింది. మా ఊళ్లో చాలా మంది నాలాగే లబ్ధి పొందారు’ అని చంద్రమ్మ వివరించింది. తోట్లవల్లూరు మండలం పాముల్లంక గ్రామానికి చెందిన సాయూ గ్రూప్‌ అధ్యక్షురాలు మోటూరు అనిత, యలమర్రుకు చెందిన సోని, అప్పకట్లకు చెందిన కుంపటి వీరమ్మ, యలమర్రుకు చెందిన వరస జయలక్ష్మి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రీతిలో మహిళలు ‘ఆసరా’ పంపిణీ కార్యక్రమాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నారు.
కృష్ణా జిల్లా పెడనలో ఎమ్మెల్యే రమేష్‌ నుంచి ఆసరా చెక్కు అందుకుంటున్న లబ్ధిదారులు 

ఊరూరా సంబరాలు 
► బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 52 చోట్ల (ఉప ఎన్నిక వల్ల వైఎస్సార్‌ జిల్లాలో వాయిదా) సంబరాలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పథకం రెండవ విడత రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలోని 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు12 జిల్లాల్లో 4,74,832 సంఘాల్లోని 46,86,241 మంది మహిళల ఖాతాల్లో రూ.3,815.31 కోట్లు మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాగా, బుధవారం సెలవు కారణంగా డబ్బు జమ కాలేదు.  
► అనంతపురం జిల్లా గోరంట్లలో మంత్రి శంకరనారాయణ, నల్లచెరువులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కణేకల్లులో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు కొనసాగాయి. కణేకల్లులో పలువురు మహిళలు ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ ప్లకార్డులు చూపారు. 
► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు.  
► పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, పశివేదలలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఆనందపురంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా 1,291 సంఘాలకు రూ.10.45 కోట్లను అందించారు.   
► ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు. ఒంగోలులో మేయర్‌ గంగాడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  
► శ్రీకాకుళం జిల్లా పొందూరులో శాసన సభాపతి తమ్మినేని సీతారాం, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో జరిగిన ఆసరా ఉత్సవాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు