YSR Asara: చివరి రోజూ అదే జోరు

19 Oct, 2021 03:43 IST|Sakshi

ముగింపు రోజైన సోమవారం 79,135 పొదుపు సంఘాలకు రూ.650 కోట్లు చెల్లింపు 

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ప్రతిచోటా వేల సంఖ్యలో ఆసరా లబ్ధిదారుల ర్యాలీలు   

31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొనసాగిన వేడుకలు

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో 79,135 పొదుపు సంఘాలకు రూ.650 కోట్ల మొత్తాన్ని జమచేసింది. గత 12 రోజులుగా (ఈనెల 7 నుంచి) లబ్ధిదారులైన మహిళలు ఎంతో ఉత్సాహంతో ఆసరా సంబరాలు జరుపుకుంటుండగా.. ముగింపు రోజైన సోమవారం 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేల నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా కొనసాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు నాటికి ఉన్న తమ బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరించి, ఆ డబ్బులను నాలుగు విడతల్లో అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలు జరిగిన ప్రతిచోటా వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి బొమ్మతో కూడిన బ్యానర్లను చేతబూని ర్యాలీలు నిర్వహించారు. అనంతరం జగన్‌ చిత్రపటాలకు పూలాభిషేకాలు నిర్వహించారు. అదే సమయంలో.. ఆయా చోట్ల జరిగిన సభల్లో చంద్రబాబు చేతిలో తామెలా మోసపోయిందీ ప్రస్తావించారు.  

సందడి సందడిగా ఆసరా సంబరాలు
► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ► అనంతపురం జిల్లా పెనుకొండలో సోమవారం మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.
► కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తకోట, గూడూరు గ్రామాల్లో  చెక్కులు అందజేశారు.
► చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.  శాంతిపురం మండలంలో జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు మహిళలకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాదాపు 40 గ్రామ సమాఖ్యల నుంచి మహిళలు పెద్దఎత్తున పూర్ణకుంభాలతో వచ్చి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 
► శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు.
► విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌ ఆసరా ఉత్సవాలు సోమవారం సందడిగా సాగాయి. పొదుపు మహిళలకు మెగా చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేశారు. డెంకాడ మండలంలో జరిగిన ఆసరా సంబరాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 
► విశాఖ జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో చెక్కులు పంపిణీ చేశారు. భీమిలి మండలం మజ్జివలసలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
► తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.  కాజులూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.  

ఉత్సాహభరితంగా.. 
► పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పొలమూరులో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ చెక్కులను పంపిణీ చేశారు. 
► కృష్ణాజిల్లా కలిదిండి మండలం తాడినాడ, విజయవాడ పాయకాపురం పరిధిలోని రాధానగర్‌లో ఆసరా వేడుకలు జరిగాయి.  
► గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. 
► ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువులో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆసరా చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు.  

మరిన్ని వార్తలు