YSR Asara: ‘వైఎస్సార్‌ ఆసరా’పై విస్తృత ప్రచారం

27 Sep, 2021 08:45 IST|Sakshi

87 లక్షల మంది పొదుపు మహిళలకు రూ.6,470 కోట్లు

7న రెండో విడత సీఎం జగన్‌ చేతులమీదుగా ప్రారంభం

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు అక్టోబర్‌ 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ ఆసరా’ రెండో విడత డబ్బుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందే మహిళలు తమ జీవనోపాధులు పెంపొందించుకునేందుకు మందుకొస్తే అదనంగా బ్యాంకు రుణాలు ఇప్పించేలా సెర్ప్‌ సిబ్బంది తోడ్పాటు అందిస్తారని వివరించారు. పాదయాత్ర హామీ మేరకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకం అమలుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు రూ.6,470 కోట్లు మేర ప్రయోజనం చేకూరనుంది. వలంటీర్లు, వీవోఏ, ఆర్పీలు ఇప్పటికే తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి సమాచారం అందిస్తున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 24వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సెర్ప్, మెప్మా కమ్యూనిటీ  కో ఆర్డినేటర్లు నాలుగు రోజులు పాటు సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 3, 4, 5, 6వ తేదీలలో సెర్ప్, మెప్మా అధికారులు గ్రామాలు, వార్డులవారీగా సమావేశాలు నిర్వహించి వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా సంఘాలకు ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు చెల్లిస్తుందన్న వివరాలను తెలియజేస్తారు. అక్టోబరు 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్సార్‌ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు