వైఎస్సార్‌ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

24 Sep, 2022 09:11 IST|Sakshi

రెండో ఏడాది జీవితకాల సాఫల్య పురస్కారాలు, అచీవ్‌మెంట్‌ అవార్డులు

ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు

నవంబర్‌ 1న అవార్డుల ప్రదానం

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌–2022’ అత్యున్నత పురస్కారాల కోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన  హైపవర్‌ స్క్రీనింగ్‌ కమిటీ శుక్రవారం విజయవాడలో సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడి కృష్ణమోహన్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రేవు ముత్యాలరాజు, అనూరాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పౌర సరఫరాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ, కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందన్నారు. అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యు దయం, సామాజిక న్యాయం, దేశ–విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి∙దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను  secy&political@ap.gov.in కు మెయిల్‌ చేయాలని తెలిపారు. గతేడాది 59 మందిని సత్కరించినట్లు గుర్తుచేశారు. ఇక వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఇస్తారన్నారు.  వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందిస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు