వైఎస్సార్‌ బీమా.. పేదలకు ధీమా 

23 May, 2022 11:12 IST|Sakshi

కేంద్రం తప్పుకున్నా అమలులో  వెనక్కి తగ్గని రాష్ట్ర ప్రభుత్వం

మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్ల అందజేత

లబ్ధిదారుడి నుంచి కొంత రుసుముతో కేంద్ర బీమా పాలసీల వర్తింపు

ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండానే ‘వైఎస్సార్‌ బీమా’

నిరుపేదలకు ఆర్థికదన్నుగా  నిలుస్తున్న జగన్‌ సర్కారు

బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. కంపెనీలు ప్రీమియమూ పెంచేశాయి. అయితే, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీమా అమలు విషయంలో వెనక్కి తగ్గలేదు. సొంతంగా వైఎస్సార్‌ బీమా పథకాన్ని తీసుకొచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. పెద్ద దిక్కు కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులకు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తోంది.  

అనంతపురం అర్బన్‌: పేదలకు సంక్షేమాన్ని అందించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వైఎస్సార్‌ బీమా అమలులో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో బీమా పథకం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఇచ్చేది. అయితే, 2020 ఏప్రిల్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం పథకం నుంచి తప్పుకుంది. ఇదే సమయంలో బీమా కంపెనీలు కూడా ప్రీమియం (కంతు) మీద 35 శాతం పెంచాయి. కేంద్రం తప్పుకోవడంతో పథకం అమలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కంపెనీలు ప్రీమియం పెంచినా, కరోనా కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. పేదలకు అండగా నిలవాలనే నిర్ణయించుకున్న వైఎస్‌ జగన్‌ సర్కారు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. వైఎస్సార్‌ బీమా పథకం తీసుకొచ్చి.. అమలు బాధ్యత మొత్తాన్నీ తన భుజాన వేసుకుంది.  

మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు.. 
వైఎస్సార్‌ బీమా ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం మధ్య మూడేళ్లలో 4,379 క్లెయిమ్‌లకు రూ.73.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెదు దుఃఖంలో కూరుకుపోయిన ఆయా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించింది. ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్‌ బీమా పాలసీదారులు 5,03,579 మంది ఉన్నారు. 

బీమా వర్తింపు ఇలా..      
వైఎస్సార్‌బీమా కుటుంబంలో ఒకరికి... ప్రధానంగా కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే వ్యక్తికి వర్తింపజేస్తారు. బీమా తీసుకునే వ్యక్తి బియ్యం కార్డులో సభ్యుడై ఉండాలి. 18 – 70 ఏళ్ల వయసు వారు బీమా పాలసీకి అర్హులు. 18– 50 ఏళ్లలోపు సహజమరణం పొందినా, 18–70 ఏళ్ల లోపు ఏదైనా ప్రమాదంలో మరణం పొందినా బీమా వర్తిస్తుంది. సహజ మరణానికి రూ. లక్ష ఇస్తారు. ప్రమాద మరణానికి రూ.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యం పొందితే రూ.2.50 లక్షలు అందజేస్తారు. మరణించిన పాలసీదారుని అంతిమ సంస్కారాలకు (మట్టిఖర్చులు) గతంలో ఉన్న రూ.5 వేల మొత్తాన్ని కూడా ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి ఇస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎంఎస్‌బీవై (ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన) కింద కూడా రూ.12 కడితేనే పాలసీకి అర్హులవుతుండడం గమనార్హం.  

ప్రభుత్వం ఆర్థిక అండనిచ్చింది
నా భర్త బోయ ఈరన్న వ్యవసాయ కూలీగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రమాదవశాత్తు 2021, నవంబరు 11న చనిపోయాడు. వైఎస్సార్‌ బీమా కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వడంతో మా కుటుంబానికి ఆర్థిక అండ లభించింది.  
– భాగ్యమ్మ, గరుడాపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గం 

రూ. 3.90 లక్షలు అందింది
లారీ డ్రైవర్‌గా పనిచేసే నా భర్త లక్ష్మణ్‌నాయక్‌ గతేడాది ప్రమాదానికి గురై చనిపోయాడు. నాకు ఇద్దరు సంతానం. బాబు వయసు 10, పాప వయసు 8 ఏళ్లు. వైఎస్సార్‌ బీమా ద్వారా ప్రభుత్వం రూ.3.90 లక్షలు ఇచ్చి ఆదుకుంది. మరో రూ.లక్ష వస్తుందని అధికారులు చెప్పారు. 
– రుక్మిణి, కువరగేరి, గుంతకల్లు 

మూడేళ్లలో రూ. 73.14 కోట్లు
వైఎస్సార్‌ బీమా పాలసీదారుడు మరణిస్తే విషయాన్ని సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు తెలియజేయాలి. వారు తక్షణమే మట్టి ఖర్చులకు రూ.10 వేలు ఇస్తారు. పథకం ద్వారా మూడేళ్లలో 4,379 మందికి రూ.73.14 కోట్లు అందించాం.  
– సత్యనారాయణ, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్, వైఎస్సార్‌బీమా 

కుటుంబ పెద్ద పేరున పాలసీ
కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండే వ్యక్తి పేరున బీమా పాలసీ తీసుకోవాలి. ఆ వ్యక్తికి ఏదేని ప్రమాదం జరిగితే బీమా ద్వారా అందే సొమ్ము కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. వలంటీర్లు కూడా కుటుంబ పోషకుని పేరునే పాలసీ ఇవ్వాలి.  
– నరసింహారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ

మరిన్ని వార్తలు