YSR Birth Anniversary: సంక్షేమ సంతకం.. చెదిరిపోని జ్ఞాపకం..

7 Jul, 2021 18:15 IST|Sakshi

వెబ్‌డెస్క్‌: వైఎస్సార్‌.. ఆయ‌న ఓ మ‌రిచిపోలేని జ్ఞాప‌కం.. అభివృద్ధికి న‌డ‌క నేర్పించ‌డ‌మే కాదు.. ప్రతీక్షణం పేద‌ల‌కు మేలు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సంక్షేమ ప‌థ‌కాల మారాజుగా నిలిచిపోయారు. మ‌హానేత‌ త‌న‌ ఐదేళ్ల మూడు నెలల అద్భుత పాల‌న‌తో ప్రజల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆయ‌న ఏం చేసినా సాహ‌సోపేత‌మే.. కనిపించని, కనీవినీ ఊహించని సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారు.

శ‌త్రువును సైతం ప్రేమించే గుణం వైఎస్సార్‌ది. ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా.. పార్టీల‌క‌తీతంగా అంద‌రిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు. అంద‌రితోనూ ఒకేలా వ్యవ‌హ‌రించేవారు.. అంత‌టి గొప్ప వ్యక్తిత్వం ఆయ‌న‌ది. రాజన్నగా తన పేరును ప్రజల పిలుపుగా మార్చుకున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన పాలకుడు రాజన్న. 1978లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికైన తర్వాత ఆయన విజయపరంపర చివరి క్షణం వరకు విజయ పథం వైపు నడిపించింది.

వ్యవసాయానికి ఊపిరినిచ్చి అన్నదాత‌ల్లో ఆత్మ విశ్వాసం నింపారు. ఉచిత విద్యుత్‌, విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు, మ‌ద్దతు ధ‌ర‌లు, విత్తనాలు, ఎరువుల ధ‌ర‌ల‌పై నియంత్రణ వంటి చ‌ర్యలతో అన్నం పెట్టే రైతుకు అండ‌గా నిలిచారు. నిలువ నీడ‌లేని పేద‌లంద‌రికీ ల‌క్షలాది ఇళ్లు క‌ట్టించారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంత‌కంతో రైతుల్లో ఆనందం నింపారు. ఉన్నత చ‌దువులు అంద‌ని  ద్రాక్ష అని దిగులు చెందుతున్న పేద విద్యార్థుల‌ను ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌తో ఆదుకున్నారు.

రైతుల క‌ష్టాల తీర్చడానికి జ‌ల‌య‌జ్ఞంతో భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టుల నిర్మాణాల‌కు అంకురార్పణ చేసి అప‌ర భ‌గీర‌థ‌డ‌య్యారు. పేద‌వాడికి రోగ‌మొస్తే ఆస్తుల‌మ్ముకునే దుస్థితిని ‘ఆరోగ్యశ్రీ’తో  త‌ప్పించి, కొండంత అండ‌గా నిలిచారు. 108తో ఆపద‌లో ఉన్నవారి ప్రాణాల‌ను కాపాడారు. 104తో ప‌ల్లెల‌కు వైద్యం అందించారు. ఏ ఒక్కరు కూడ తిండికి ఇబ్బంది పడకూడద‌నే పెద్ద మ‌న‌స్సుతో రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం ప‌థ‌కం ప్రవేశపెట్టారు. అర్హులైన పేద‌ల‌కు ఇళ్లు, రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు ఇవ్వడమే ల‌క్ష్యంగా ఇందిర‌మ్మ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టారు. రాజీవ్ గృహ‌క‌ల్ప‌, రాజీవ్ స్వగృహ ప‌థ‌కాల‌ను ప్రవేపెట్టారు. మ‌హిళా సాధికారిత‌కు ఇందిరా క్రాంతి ప‌థ‌కం రూపొందించారు. అభ‌యహ‌స్తం పేరుతో 60 ఏళ్లు నిండిన ప్రతీ మ‌హిళ‌కూ పింఛ‌న్ ఇచ్చారు.

ఎన్ని సమస్యలు వచ్చినా.. తండ్రి బాటలో నడుస్తూ.. 
తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయుణ్ని అనిపించుకుంటున్నారు సీఎం జగన్... తండ్రి గుర్తొచ్చేలా ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు. తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా పరిపాలిస్తానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. సహనం, ఓర్పుతో తనదైన మార్కు పాలన అందిస్తున్నారు. నవరత్నాలతో పాటు మరిన్ని అవసరాలను గుర్తించి, తాను అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వాటిని నెరవేర్చేందుకు సీఎం జగన్‌ పడుతున్న కష్టం ఎవరికీ తెలియంది కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి  వైఎస్‌ జగన్‌ పని చేస్తున్నారు.

మరిన్ని వార్తలు