కొత్తగా 45 ఏళ్లు నిండే మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’

13 May, 2021 03:15 IST|Sakshi

వలంటీర్ల ద్వారా కొత్త లబ్ధిదారుల గుర్తింపు

45–60 ఏళ్ల మధ్య వయస్సు గల 24 లక్షల మందికి గతేడాది సాయం

ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున లబ్ధి

నాలుగేళ్లలో రూ.75 వేల సాయం

సాక్షి, అమరావతి: ఈ ఏడాది కొత్తగా 45 ఏళ్లు నిండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కూడా వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 45 ఏళ్ల వయస్సు నిండిన అర్హులైన మహిళలను వలంటీర్ల ద్వారా గుర్తించే ప్రక్రియను మొదలు పెట్టారు. సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులైన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొదటి విడతలో 24 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.4,500 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. కాగా, గత ఏడాది 44 ఏళ్ల వయస్సు పూర్తయి పథకానికి అర్హత పొందలేకపోయిన వారిని ఈ ఏడాది అధికారులు గుర్తిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ ఏడాది 60 ఏళ్ల వయస్సు పూర్తయిన వారిని కూడా వలంటీర్లు గుర్తిస్తారు. ఇకపై వీరు పెన్షన్‌ పథకం కిందకు వస్తారు. ఈ మేరకు రెండో ఏడాది పథకం అమలుకు వలంటీర్ల ద్వారా ఆయా వయస్సు వారిని ప్రత్యేకంగా గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులో ఉంచారు. వలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌కు లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు