YSR Congress 12th Formation Day: నాడు కుట్రలు చేధించి నేడు సుపరిపాలనతో..

12 Mar, 2022 08:49 IST|Sakshi

12th Formation Day Of YSR Congress Party 2022: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 సెప్టెంబర్‌ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందడం కోట్లాది మందిని నిశ్చేష్టులను చేసింది. ఆయన మరణించడం తట్టుకోలేక వందలాది మంది గుండె పగిలి మృతి చెందారు. అలా చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని వైఎస్‌ జగన్‌ ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఓదార్పు యాత్ర చేయకూడదని హూంకరించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆ హూంకరింపులకు భయపడకుండా ఓదార్పు యాత్ర చేపడతానని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఆ ప్రస్థానం ఇలా సాగింది.

2010: మొగ్గలోనే తుంచేసేందుకు కుట్రలు
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్రను ఆపేయాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్టానం తెగేసి చెప్పడంతో.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం.. నైతిక విలువలకు కట్టుబడి కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ నుంచి సంక్రమించిన కడప ఎంపీ పదవికి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్‌ జగన్, వైఎస్‌ విజయమ్మలు రాజీనామా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ఉద్యమబాట పట్టారు. దీంతో వైరిపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌ అధిష్టానం కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టించింది.

2011: ప్రజాభ్యుదయమే ఆశ, శ్వాస 
ప్రజాభ్యుదయమే పరమావధిగా.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీని వైఎస్‌ జగన్‌ స్థాపించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ జగన్, పులివెందుల శాసనసభ స్థానం వైఎస్‌ విజయమ్మలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. తమ కోసం నిలబడిన వారిద్దరినీ రికార్డు మెజార్టీతో జనం గెలిపించారు. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. కాంగ్రెస్‌ నుంచి సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తేనే వైఎస్సార్‌సీపీలో చేరడానికి అవకాశం ఇస్తామని షరతు పెట్టారు. తద్వారా రాజకీయాల్లో మాయమవుతున్న నైతిక విలువలను పరిరక్షించేందుకు నడుం బిగించారు. 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి.. వైఎస్సార్‌సీపీలో చేరారు.

2012: అణగదొక్కేందుకు అక్రమ నిర్బంధం
ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగారు. వారి తరఫున ప్రచారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను విచారణ కోసమని పిలిచిన సీబీఐ.. అరెస్టు చేసింది. తమ కోసం నిలబడిన వైఎస్‌ జగన్‌ను అరెస్టు చేసినా.. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 17 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానంలో రికార్డు మెజార్టీతో గెలిపించి.. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను జనం చిత్తు చేశారు.   వైఎస్‌ జగన్‌ను సీబీఐ అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ‘జగన్‌ కోసం జనం’ పేరుతో కోటి సంతకాలు చేశారు.  

2013: ప్రజా క్షేత్రంలోకి
దాదాపు 16 నెలల అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన వైఎస్‌ జగన్‌.. ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర విభజనలో కేంద్రం తీరును నిరసిస్తూ ఉద్యమబాట పట్టారు. ఆమరణ దీక్ష చేశారు. లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. 

2014: కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో..
విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే.. వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్ల కోసం టీడీపీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తే.. అమలు చేయగలిగే హామీలను మాత్రమే వైఎస్‌ జగన్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో 67 శాసనసభ, ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. 

2015: ప్రతిపక్షం.. ప్రజాపక్షం
రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఉద్యమించారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. 

2016: అలుపెరగని పోరాటం
ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటం చేశారు. కానీ.. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక సహాయానికి అంగీకరించారు. దీన్ని నిరసిస్తూ వైఎస్‌ జగన్‌ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్‌ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు.

2017: అసెంబ్లీ నుంచి ప్రజాక్షేత్రంలోకి
టీడీపీ సర్కార్‌ దోచుకుంటోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఓ వైపు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను 23 మందిని కొనుగోలు చేసిన చంద్రబాబు, వారిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకుని విలువలకు వలువలు వదలడం మరో వైపు.. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ బహిష్కరించారు.  ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

2018: పాదయాత్రకు బ్రహ్మరథం
వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు.. వైఎస్సార్‌సీపీకి ఆదరణ నానాటికీ పెరుగుతుండటంతో నాటి అధికార టీడీపీ దాన్ని తగ్గించేందుకు చేయని కుట్ర లేదు.. కుతంత్రం లేదు.

2019: దేశ చరిత్రలో తిరుగులేని విజయం
వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. సాధారణ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అఖండ విజయం సాధించింది.  2019 మే 30న అధికారం చేపట్టిన తొలి రోజే సంక్షేమాభివృద్ధి పథకాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసి.. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపారు. గిరిజన మహిళను డిప్యూటీ సీఎంగా.. ఎస్సీ మహిళను హోంమంత్రిగా నియమించారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ.. మహిళలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ దేశంలో చట్టం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 

2020: సుపరిపాలనలో నంబర్‌ 1
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల మేనిఫెస్టోలో సింహభాగం హామీలను అమలు చేసి రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. కరోనా సమయంలోనూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చర్యలు తీసుకున్నారు. దాంతో దేశంలో స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచింది.

2021: మరింత పెరిగిన జనాదరణ
సంక్షేమాభివృద్ధి పథకాల అమలుతోపాటు సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయం సాధించింది. తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన చర్యల వల్ల దేశంలో స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో  సుపరిపాలనలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాది నంబర్‌ వన్‌గా నిలిచింది.  

సంక్షేమాభివృద్ధి ప్రదాత, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సరిగ్గా 11 ఏళ్ల క్రితం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మలతో మొదలైన వైఎస్సార్‌సీపీ.. ఇంతింతై వటుడింతై అన్న రీతిలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సమస్యలు.. సవాళ్లు, దాడులను ఎదుర్కొంది. వాటిని తట్టుకుని నిలవడమే కాకుండా మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడింది. తమ కోసం నిలబడిన, తమ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ వెంట జనం అడుగులేస్తూ నీరాజనాలు పలుకుతున్నారు.

– ఆలమూరు రామగోపాలరెడ్డి 

మరిన్ని వార్తలు