Municipal Corporation: ఏలూరులో విజయభేరి

26 Jul, 2021 02:08 IST|Sakshi

50 డివిజన్లకు గాను 47 అధికార పార్టీవే

టీడీపీ మూడు స్థానాలకే పరిమితం

20 చోట్ల పోటీచేసినా బోణీ కొట్టని జనసేన.. 16 చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ

వామపక్షాలు, కాంగ్రెస్‌ ఉనికి గల్లంతు

ముగిసిన కౌంటింగ్‌ ప్రక్రియ

ఈనెల 30న మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి అమరావతి: మరోసారి అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రికార్డు స్థాయి విజయంతో నగర పీఠాన్ని దక్కించుకుంది. 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందగా టీడీపీ కేవలం మూడు డివిజన్లకే పరిమితమైంది. జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయాయి. ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత ఆదివారం నిర్వహించిన కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 30న మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది. 

పోస్టల్‌ బ్యాలెట్లతో లెక్కింపు మొదలు..
ఏలూరులోని సర్‌ సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 50 డివిజన్లకు గాను మూడు డివిజన్లను వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో 47 డివిజన్లకు ఎన్నికల ప్రక్రియ ఈ ఏడాది మార్చి 10న జరిగింది. పోలింగ్‌ 56.86 శాతంగా నమోదైంది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నట్లు హైకోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, కౌంటింగ్‌ ఎప్పుడు నిర్వహించాలో తరువాత ప్రకటిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ క్రమంలో మే 7న ఈ కేసులో తుది తీర్పు ప్రకటించారు. దీనిపై దాఖలైన కేసును కొట్టివేస్తూ కోవిడ్‌ నిబంధనలను అనుసరించి కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియకు రెండు నెలలు బ్రేక్‌ పడగా ఆదివారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. మొత్తం 15 ఓట్లకు గాను వైఎస్సార్‌సీపీకి 11, టీడీపీకి 1, నోటాకు 1 ఓటు పోలయ్యాయి. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఉదయం ఎనిమిది గంటలకు 47 డివిజన్లకు సంబంధించి 47 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ కౌంటింగ్‌ సరళిని పరిశీలించారు. 
గెలుపొందిన ఆనందంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు  

భారీ మెజారిటీలతో అభ్యర్థుల గెలుపు...
47 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ 44 స్థానాల్లో ఘన విజయం సాధించింది. 10కి పైగా డివిజన్లలో 1,000 ఓట్ల కంటే అత్యధిక మెజారిటీతో పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.  23వ డివిజన్‌ నుంచి గెలుపొందిన కలవకొల్లు సాంబశివరావు 1828 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆరో డివిజన్‌ నుంచి సుంకర చంద్రశేఖర్‌ 1753 ఓట్లు, 19వ డివిజన్‌ నుంచి యర్రంశెట్టి నాగబాబు 1580 ఓట్లు, 50వ డివిజన్‌ నుంచి మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ 1495 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఏలూరు కార్పొరేషన్‌ భవనం 

మృతిచెందిన ఇద్దరు అభ్యర్థుల విజయం...
రెండు నెలల క్రితం కోవిడ్‌ బారిన పడి మృతిచెందిన ఇద్దరు అభ్యర్థులు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీరిద్దరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే. 45వ డివిజన్‌ నుంచి పోటీచేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058, 46వ డివిజన్‌ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

జగన్‌ పాలనపై జనవిశ్వాసం.. ఈ ఫలితం
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలనపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఏలూరు నగరపాలకసంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఏలూరులోఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన వారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన చంద్రబాబు ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఆఖరికి ఫలితాలను అడ్డుకునేందుకు సైతం నీచ రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున 47 మంది కార్పొరేటర్లు విజయం సాధించడం సీఎం జగన్‌ రెండేళ్ల ప్రజారంజక పాలన వల్లేనని పేర్కొన్నారు.  


విజేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ శ్రీధర్‌ తదితరులు 

టీడీపీకి దక్కింది ఆ మూడే...
గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 43 డివిజన్లలో గెలుపొందిన టీడీపీ ఈసారి దారుణ పరాజయాన్ని చవిచూసింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. 28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నాలుగు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. 2014తో పోలిస్తే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ 43, వైఎస్సార్‌సీపీ 7 డివిజన్లలో గెలుపొందాయి. నాడు వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ తన బలాన్ని 47కు పెంచుకుంది. తాజా ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 47 డివిజన్లలో గెలుపొందగా టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కావడం గమనార్హం.

జనసేన ఉనికి గల్లంతు...
20 డివిజన్లలో పోటీకి దిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించినా ఒక్కచోట కూడా బోణీ కొట్టకపోగా కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 16 డివిజన్లలో పోటీచేసిన బీజేపీ అన్నిచోట్లా ఓటమి పాలైంది. వామపక్షాలు రెండూ కలసి నాలుగు డివిజన్లలో పోటీ చేసి పరాజయం పాలయ్యాయి.

మరిన్ని వార్తలు