ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్‌సీపీ

24 Mar, 2021 04:29 IST|Sakshi

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు

వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ వేదికగా వైఎస్సార్‌ సీపీ మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. లోక్‌సభలో మంగళవారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. కేంద్రమంత్రి సూటిగా సమాధానమివ్వాలని మిథున్‌రెడ్డి కోరారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని అడగ్గా.. మిథున్‌రెడ్డి అనుబంధ ప్రశ్న అడిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2014లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ముగిసిపోయిందన్నారు. 

స్టీల్‌ ప్లాంట్‌ దేశానికి, ఏపీకి గొప్ప ఆస్తి
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ తరఫున గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మిథున్‌రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌కు మైన్స్‌ కేటాయించి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దితే దేశానికి, రాష్ట్రానికి గొప్ప ఆస్తిగా మిగులుతుందని వివరించారు. పోలవరం నిర్మాణం కీలక దశలో ఉందని, కేంద్రం వేగవంతంగా స్పందించాలన్నారు. ఏపీలో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సహకారం అందించాలని కోరారు. వివిధ పద్దుల కింద పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు