తిరుగులేని 'విక్టరీ'

15 Feb, 2021 02:37 IST|Sakshi

ఊరూరా వైఎస్సార్‌సీపీ అభిమానుల హుషార్‌

రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో విజయ భేరి

ఇదివరకెన్నడూ లేని విధంగా 80 శాతం పంచాయతీలు కైవసం 

మిగతా స్థానిక ఎన్నికలకూ సిద్ధం అంటున్న పార్టీ శ్రేణులు

అనేక చోట్ల టీడీపీ మద్దతుదారులుగా పోటీకి అభ్యర్థుల కరువు

సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలకే పట్టం కట్టిన పల్లె జనం

రానున్న ఎన్నికల ఫలితాలపైనా ఆశాభావం

డీలా పడ్డ టీడీపీ.. సొంత పార్టీ నుంచే చంద్రబాబుపై వ్యతిరేకత

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సానుకూల ఫలితాలతో వైఎస్సార్‌సీపీలో జోష్‌ రెట్టింపు అయింది. ఇక ఇదే ఊపుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకూ రెడీ అంటోంది ఆ పార్టీ. వైరి పక్షాన్ని మట్టి కరిపించడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో ఊహించినట్టే ఆ పార్టీ అభిమానులకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఊరు, వాడ, జిల్లా, ప్రాంతం తేడా లేకుండా విజయ దుందుభి మోగించారు. 81% పంచాయతీలు వైఎస్సార్‌సీపీ అభిమానుల వశమయ్యాయి. విపక్ష టీడీపీ 16 శాతం పంచాయతీలు మాత్రమే దక్కించుకుంది. వైఎస్సార్‌సీపీకి ఇది అసాధారణ విజయం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

2019లో జరిగిన సాధారణ ఎన్నికలను మించి పంచాయతీ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. గత చరిత్రను చూస్తే అధికార పార్టీ అభిమానులు 60 శాతానికి మించి గెలిచిన సందర్భాల్లేవు. ఇప్పుడు ఏకంగా 80 శాతానికిపైగా పల్లె జనం ప్రభుత్వానికే జై కొట్టారు. మొదటి దశలో 3,249 పంచాయతీలకు గాను వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలిచినవి 2,640. టీడీపీ మాత్రం 509 పంచాయతీలతో సరి పెట్టుకుంది. రెండో దశలో 3,328 పంచాయతీలకు గాను (ఇందులో శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో పంచాయతీ చొప్పున మూడింటికి నామినేషన్‌ దాఖలు కానందున ఎన్నికలు జరగలేదు) 2,649 (ఏకగ్రీవాలతో సహా) అధికార పార్టీ అభిమానులకే దక్కడం విశేషం. 

పెరిగిన నమ్మకం
గ్రామీణ ప్రజలు మొదట్నుంచీ వైఎస్‌ జగన్‌ను విశ్వసిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. అప్పటి అరాచక టీడీపీ పాలనను ఎదుర్కొనే నేత జగన్‌ అని నమ్మారు. ఊరూవాడా ఆయనకు తమ గోడు చెప్పుకున్నారు. ప్రతి సభలోనూ జగన్‌ స్థానిక సంస్థల గురించి ప్రస్తావించారు. తాను అధికారంలోకొస్తే చేయబోయే పనులేంటో స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు పల్లె జనానికి తానిచ్చిన హామీలపైనే దృష్టి పెట్టారు. గెలిచిన మొదటి సంవత్సరంలోనే 90 శాతం హామీలను అమలు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఊళ్లోనే వెలసిన గ్రామ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించింది. దీన్నో పెద్ద మార్పుగా ప్రజలు భావించారు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఇంటికొచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం.. అవినీతి, రాజకీయాలకు తావు లేని వ్యవస్థ.. గ్రామీణ జనంలోకి జగన్‌ను మరింత చొచ్చుకుపోయేలా చేసింది. ఈ దృష్ట్యా ప్రజలు అధికార పార్టీ అభిమానులనే గెలిపించుకోవాలనే నిర్ణయానికొచ్చారు. అందుకే ప్రతి చోట ఫలితం దాదాపు ఏక పక్షంగా కనిపిస్తోంది. 

దాష్టీకానికి చరమగీతం
దశాబ్దాలుగా టీడీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న పంచాయతీల్లో ఎన్నికల శంఖం పూరిస్తూ జనం ముందుకొచ్చారు. స్వేచ్ఛాయుత ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందుకే టీడీపీ నేత ఆధిపత్యం చెలాయించే టెక్కలి నియోజకవర్గంలో 12 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కోట బొమ్మాళిపై వైఎస్సార్‌సీపీ అభిమాని జెండా ఎగుర వేశారు. నిమ్మాడలోనూ అచ్చెన్న అధిపత్యానికి చెక్‌ పడింది. యనమల రామకృష్ణుడు సొంత పంచాయతీలో కూడా ప్రజలు టీడీపీని చీత్కరించారు. ఆయన సొంత మనుషులనే జనం ఓడించారు. తుని నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలు వైఎస్సార్‌సీపీ అభిమానులు క్లీన్‌ స్వీప్‌ చేశారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లిన జనసేనకూ చుక్కెదురైంది. వాళ్లు నిలబెట్టిన అభ్యర్థులు ఏక సంఖ్యకు పరిమితం కావడమే ఎక్కువగా కనిపించింది. టీడీపీ నేత దేవినేని ఉమ సొంత ప్రాంతంలోనూ జనం వైఎస్సార్‌సీపీ అభిమానులకు పట్టం కట్టారు. చంద్రబాబు తనయుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న మంగళగిరిలో కూడా టీడీపీకి పరువు దక్కలేదు. ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు ప్రజల్లోకి దూసుకుపోయారు. 

విపక్షానిది మేకపోతు గాంభీర్యమే!
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్‌సీపీ బలం ప్రస్తుతం మరింత పెరిగిందని తెలుగుదేశం పార్టీకీ తెలుసు. గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభంజనం కొనసాగుతోందనే నిజం చంద్రబాబుకూ తెలియని విషయం కాదు. పంచాయతీ ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వాళ్లే ఎక్కువగా పోటీ పడతారని, అప్పుడు గ్రూపులు ఏర్పడతాయనేది టీడీపీ వ్యూహం. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ సహకరించారనేది చాలా మంది ఆరోపణ. అయితే ఈ ఎత్తుగడ తారుమారైంది. పలు పంచాయతీల్లో టీడీపీ అభిమానిగా పోటీ చేస్తామని ముందుకొచ్చే వారి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొనడం గమనార్హం.

సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని టీడీపీ కేడరే ఒప్పుకుంటోంది. దీంతో ఇప్పుడు పోటీ చేయడం సరికాదని, వాళ్లే వైఎస్సార్‌సీపీ అభిమానులను అనేక చోట్ల నిలబెట్టారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేని ఎదురు దెబ్బలు. ఈ పరిస్థితుల్లో మిగతా స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టంగానే ఉంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్‌సీపీపై టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. వైఎస్సార్‌సీపీ విజయాన్ని దౌర్జన్యంతో ముడిపెట్టే దుస్సాహసం చేస్తోంది. ఈ సరికొత్త ప్రయోగం మిగతా రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులకే లాభిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు