మార్గనిర్దేశకుడు వైఎస్సార్‌.. ఆ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలుగా..

2 Sep, 2022 08:03 IST|Sakshi

దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి కారణం  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనే. దానిని 2004, మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన ప్రారంభించారు.

దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నత విద్యను పేదలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తొలుత శ్రీకారం చుట్టిందీ వైఎస్సే. పాలకులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి టార్చ్‌బేరర్‌గా నిలిచారనడానికి ఈ మూడు పథకాలు సజీవ సాక్ష్యాలు. ఆ మహానేత భౌతికంగా దూరమై నేటికి సరిగ్గా 13 ఏళ్లు.

సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పనిచేసింది కేవలం ఐదేళ్ల మూడు నెలలే. కానీ, ఆ కొద్దికాలంలోనే తెలుగునేల ఆయన్ను కలకాలం గుర్తుంచుకునేలా సుపరిపాలన అందించారు. పాలనకు మానవత్వాన్ని జోడించి పాలకుడంటే ఇలా ఉండాలి అని దేశానికి చాటిచెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 1949, జూలై 8న జన్మించిన వైఎస్‌.. వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. రూపాయికే వైద్యంచేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రశంసలు అందుకున్నారు.

ప్రజాభ్యుదయమే పరమావధిగా..
డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటినుంచి తుదిశ్వాస విడిచే వరకూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాభ్యుదయమే పరమావధిగా రాజీలేని పోరాటం చేశారు. దాంతో పులివెందుల నుంచి 1978, 1983, 1985.. కడప లోక్‌సభ స్థానం నుంచి 1989, 1991, 1996, 1998.. ఆ తర్వాత పులివెందుల నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజలు ఆయన్ను అజేయుడిగా నిలిపారు.

పాలకులకు మార్గనిర్దేశకుడిగా..
వరుస ఓటములతో ఉమ్మడి ఏపీలో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను వైఎస్‌ మండుటెండలో 1,475 కి.మీల పొడవున పాదయాత్ర చేసి ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థంచేసుకుని, నేనున్నానని భరోసా ఇచ్చిన ఆయన 2004, మే 14న సీఎంగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రజలను ఓటర్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించారు. విద్య, వైద్యం కోసం ప్రజలు అప్పులపాలవుతుండటాన్ని పసిగట్టి.. వాటిని ఉచితంగా అందించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు.
చదవండి: మరో రూపంలో మహానేత 

అలాగే, ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి 108 సర్వీసును ప్రారంభించి లక్షలాది మందికి ప్రాణంపోశారు. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులను అనేక రాష్ట్రాలు అమలుచేస్తుండటం ఆయన దార్శనికతకు నిదర్శనం. ఇక ఐదేళ్లలో సంక్షేమాభివృద్ధి పథకాలతో జనరంజక పాలన అందించిన వైఎస్‌.. గెలుపోటములకు తనదే బాధ్యత అని 2009 ఎన్నికల్లో ప్రకటించారు. ప్రతిపక్షాలు మహాకూటమి కట్టినా 2009 ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, 2009, మే 20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు.

రూ.లక్ష కోట్లతో జలయజ్ఞం..
కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరాన్ని పట్టాలెక్కించారు. 2009 నాటికే 16 ప్రాజెక్టులను పూర్తిగా.. 25 ప్రాజెక్టులను పాక్షికంగా వెరసి 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు.

దార్శనికతకు తార్కాణాలెన్నే..
ప్రపంచవ్యాప్తంగా 2007–08, 2008–09లో ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. కానీ.. అది రాష్ట్రంపై పడకుండా వైఎస్‌ చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారుల పనులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి.. మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేసి.. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని వైఎస్‌ కాపాడారని అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు. ఇక ఐటీకి వెన్నుదన్నుగా నిలిచి ఎగుమతులను రెట్టింపయ్యేలా చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తిచేసి హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపారు. 

పండగలా వ్యవసాయం..
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్‌కు రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు. అందుకే పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకుండా.. వ్యవసాయాన్ని పండగలా మార్చేలా పలు కీలక నిర్ణయాలు అమలుచేశారు. 
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. 
పంటలులేక విద్యుత్‌ చార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కార్‌ రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేశారు. 
రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షల పంపు సెట్లకుపైగా ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ.. ఆ తర్వాత ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా వెనక్కు తగ్గలేదు. 
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక.. ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని వైఎస్‌ కల్పించారు. వైఎస్‌ స్ఫూర్తితో దేశంలో పలు రాష్ట్రాలు సాగుకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. 
ఇక పావలా వడ్డీకే రైతులకు రుణాలందించి.. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిని తప్పించారు. 
నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించారు. పంట పండినా.. ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలుచేశారు. ఇన్‌çపుట్‌ సబ్సిడీని అందించారు. 
పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1,000 వరకూ పెరగడమే అందుకు నిదర్శనం. 

మరిన్ని వార్తలు