Eguvaramapuram: సైనికుల ఊరు.. సరిలేరు మీకెవ్వరు

29 Dec, 2022 15:35 IST|Sakshi
ఎగువరామాపురం గ్రామం వ్యూ

సైన్యంలో కీలక భూమిక పోషిస్తున్నఎగువరామాపురం యువ కిశోరాలు

అత్యున్నత శిక్షణ పొందిన కమాండో, సీఎంపీ విభాగాల్లో సైతం భాగస్వామ్యం

కార్గిల్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ ముష్కరులను తరిమికొట్టిన ధీశాలురు

ముంబయి తాజ్‌ హోటల్‌ వద్ద ఆపరేషన్‌ ‘సైక్లోన్‌’లో కీలకం ఇక్కడి యువతే

ఊరి పేరును గర్వంగా చెప్పుకుంటామంటున్న గ్రామస్తులు   

భారత భూభాగాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, పొరుగు దేశాల దురాక్రమణలను అడ్డుకుంటూనే, ఎప్పటికప్పుడు యుద్ధానికి సన్నద్ధులై కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్రధారులుగా ఆ గ్రామ యువత దేశరక్షణలో నిమగ్నమైంది. సాధారణ సిపాయి నుంచి అత్యున్నత శిక్షణ పొందిన కమాండో, సెంట్రల్‌ మిలటరీ పోలీసు (సీఎంపీ) వరకూ ఆ గ్రామానికి చెందిన వారు సేవలందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధభూమిలో ఆ గ్రామ యువత కీలకంగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్‌ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న ఆ గ్రామం పేరు ఎగువరామాపురం. కలసపాడు మండలంలోని ఒక్క ఎగువ రామాపురం నుంచే దాదాపు 300 మంది యువకులు దేశరక్షణలో ఉండడం విశేషం. 

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2200 మంది భారతదేశ రక్షణ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తుంటే ఒక్క కలసపాడు మండలంలోనే దాదాపు 700 మందికి పైగా ఉన్నారు. అంటే జిల్లా నుంచి సైన్యంలో పనిచేస్తున్న వారిలో 30 శాతం వాటా కలసపాడు మండలానిదేనని స్పష్టమవుతోంది. ఈ మండలంలో ప్రధానంగా ఎగువరామాపురం, ఎగువ తంబళ్లపల్లె, రాజుపాళెం గ్రామాల నుంచే ఆర్మీలో ఉండడం మరో విశేషం. వారిలో అత్యధికంగా ఎగువరామాపురం వాసులు ఉన్నారు. పాకిస్థాన్‌తో తలపడిన కార్గిల్‌ యుద్ధంలో సైతం వీరి భాగస్వామ్యం ఉంది. ముంబయి తాజ్‌ హోటల్‌ వద్ద పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో తలపడ్డ ఆపరేషన్‌ ‘సైక్లోన్‌’లో కూడా ఎగువరామాపురం గ్రామానికి చెందిన కమాండో ఉన్నారు. ఇలా అనేక ఆపరేషన్లలో ఆ గ్రామానికి చెందిన యువత భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

కార్గిల్‌ యుద్ధంలో..  
నిత్యం మంచు ముద్దలు, మంచు కొండలు విరిగిపడుతుంటాయి. అలాంటి ప్రాంతంలో 1999 మే 13వతేదీ నుంచి 28 వరకు కార్గిల్‌లో యుద్ధం జరిగింది. భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌ ముష్కరులను భారత సైన్యం తరిమికొట్టింది. ఈ యుద్ధంలో ఎగువరామాపురానికి చెందిన వారు 20 మంది ఉండడం మరో విశేషం. 2008 డిసెంబర్‌లో భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుబడ్డ ముంబయి నగరంలో తాజ్‌ హోటల్‌పై పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. వారిని తుదముట్టించేందుకు ఢిల్లీ నుంచి బ్లాక్‌ క్యాట్‌ క మాండోలను ముంబయికి  తరలించారు. ఆపరేషన్‌ ‘సైక్లోన్‌’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్‌లో ఎగువరామాపురానికి చెందిన కమాండో బండి ప్రతాప్‌రెడ్డి పాల్గొని విజయకేతనం ఎగురవేసి దేశ ప్రతిష్టలో భాగస్వామి అయ్యాడు. 


అన్నదమ్ములం ఇద్దరం ఆర్మీలో చేరాం 

మేం ఇద్దరం అన్నదమ్ములం. ఇద్దరం ఆర్మీలో చేరాం. మా అమ్మా నాన్న పొలంలో కష్టం చేసి మా ఇద్దరిని చదివించారు. జీవనోపాధికి ఆర్మీలో చేరినా దేశ భద్రతలో మేం కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మిలటరీలో చేరి 13 సంవత్సరాలు అయింది. సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ పనుల్లో అమ్మా నాన్నకు చేదోడుగా ఉంటున్నాం.      
– వై.వెంకటరెడ్ధి ఆర్మీ ఉద్యోగి,ఎగువ రామాపురం


దేశసేవ తృప్తిగా ఉంది 

మాది చాలా పేద కుటుంబం. పదవ తరగతి పూర్తయిన వెంటనే పై చదువులకు వెళ్లే పరిస్థితులు లేవు. ఆర్మీలో అయితే త్వరగా జాబ్‌ వస్తుందని పదవ తరగతి పూర్తి అయిన వెంటనే సెలక్షన్‌కు పోయా, ఉద్యోగం వచ్చింది. దాంతో బతుకు దెరువు దొరికింది. అమ్మా నాన్నలు కూడా ఆర్మీలోనే చేరమని చెప్పారు. దేశ సేవ చేస్తున్నానన్న ఆనందం ఉంది. ఇప్పటికి 15 సంవత్సరాలు సర్వీస్‌ పూర్తి అయింది. ఆర్మీ కమ్యూనికేషన్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను.     
– కె.కిరణ్‌కుమార్‌ ఆర్మీ ఉద్యోగి.ఎగువ రామాపురం


మాకెంతో గర్వకారణం 

దేశ రక్షణలో మా గ్రామస్తుల భాగస్వామ్యం ఉండడం మాకెంతో గర్వకారణం. తరాలు మారినా ఆర్మీకి వెళ్లడంలో గ్రామ యువత ఎప్పటికీ ముందుంటుంది. గ్రామానికి చెందిన ఉదయగిరి చెన్నయ్య(40), నడిపి మస్తాన్‌(45) మరో ఇరువురు ప్రమాదవశాత్తు, అనారోగ్య పరిస్థితులతో మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ ఆర్మీకి పంపేందుకు తల్లిదండ్రులు సంకోచించరు. దేశానికి సేవ చేస్తున్నామనే తృప్తే మెండుగా ఉంటుంది. ఆర్మీలో ఎంతో క్రమశిక్షణతో మా గ్రామానికి చెందిన వారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికోద్యోగులను ఆదుకోవాలి.            
– వెంకటయ్య సర్పంచ్, ఎగువ రామాపురం

మరిన్ని వార్తలు