వైఎస్సార్‌ జిల్లా రికార్డు.. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు...

27 Mar, 2022 03:52 IST|Sakshi

జిల్లాలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి అందుబాటులో డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు 

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి డిజిటల్‌ జిల్లాలుగా గుంటూరు, శ్రీకాకుళం 

ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలపై దృష్టి సారించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 

నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచడమే ఆర్బీఐ లక్ష్యం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర బ్యాంకింగ్‌ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్‌ జిల్లాగా వైఎస్సార్‌ రికార్డు సృష్టించింది. వైఎస్సార్‌ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్‌ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్‌ జిల్లా ఎంపికైంది.

ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు. వైఎస్సార్‌ జిల్లాలో మొత్తం 377 బ్యాంకు శాఖలు ఉండగా.. అందులో 26,09,254 ఖాతాలు ఉన్నాయి. డిజిటల్‌ జిల్లాలో భాగంగా 88.39 శాతం మందికి రూపే/డెబిట్‌ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అలాగే 24.19 శాతం మంది నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగిస్తున్నారన్నారు. 38.39 శాతం మందిని మొబైల్, యూపీఐ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించినట్లు తెలిపారు.  

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు 
రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్‌ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 333 బ్యాంకు శాఖలు ఉండగా 38.14 లక్షల ఖాతాలు, గుంటూరు జిల్లాలో 854 బ్యాంకు శాఖలు ఉండగా 102.46 లక్షల ఖాతాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఈ ఖాతాదారులందరూ ఏదో ఒక డిజిటల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించి సమీక్షించుకోవడం ద్వారా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ రెండు జిల్లాలను డిజిటల్‌ జిల్లాలుగా మారుస్తామన్నారు. 

ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలు 
కాగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో తక్కువగా బ్యాంకింగ్‌ సేవలను వినియోగిస్తున్న మూడు జిల్లాలను ఎంపిక చేసింది. అక్కడ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో విజయనగరం, వైఎస్సార్, విశాఖ జిల్లాలను ఎంపిక చేసినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 294 బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి.

వైఎస్సార్‌ జిల్లాలో 377 శాఖలు, విశాఖపట్నం జిల్లాలో 778 బ్యాంకు శాఖలు ఉన్నాయి. అయితే చాలా గ్రామాలు గిరిజన ప్రాంతాలు కావడంతో ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటివి లేక స్థానిక ప్రజలకు బ్యాంకింగ్‌ సదుపాయం అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు శాఖలు, ఇండియన్‌ పోస్ట్‌ లేదా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి కొత్త జిల్లాలు రానుండటంతో మౌలిక వసతులు మెరుగుపడి ఇంటర్నెట్‌తో అనుసంధానం పెరుగుతుందన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు