వడివడిగా ఈ-పంట నమోదు

22 Aug, 2022 10:56 IST|Sakshi

నేరుగా పొలం వద్దనే సమాచార సేకరణ

జిల్లాలో ఇప్పటి వరకు 40 వేల ఎకరాల్లో ఈ క్రాప్‌ నమోదు

రాష్ట్రంలో వైఎస్సార్‌ జిల్లాకు రెండోస్థానం

కడప అగ్రికల్చర్‌: రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) ఏర్పాటు చేసి విత్తనం మొదలుకుని పంట దిగుబడి చేతికొచ్చే వరకు అన్ని రకాల సేవలందిస్తోంది. అలాగే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంలో ఈ క్రాప్‌ పేరుతో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.ఇందులో భాగంగా రైతులు ఏయే పంటలు సాగు చేశారు..ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను వ్యవసాయ అధికారులు ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు.  

ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు
జిల్లాలో 36 మండలాల పరిధిలోని 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 91,741 హెక్టార్లలో సాధారణ వ్యవసాయ సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 38,592 హెక్టార్లలో వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో 3,398 హెక్టార్లలో వరి, 531 హెక్టార్లలో సజ్జ, 236 హెక్టార్లలో మొక్కజొన్న, కంది 968 హెక్టార్లలో, మినుము 1687 హెక్టార్లలో, వేరుశనగ 2601 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1385 హెక్టార్లలో, సోయాబీన్‌ 2,706 హెక్టార్లలో సాగైంది. వీటిలో ఏయే పంటలు ఎంతమేర సాగయ్యాయనే వివరాలను విలేజ్‌ అగ్రికల్చర్, హార్టీకల్చర్‌ సెరీకల్చర్‌ అసిస్టెంట్లు నేరుగా రైతుల పొలం వద్దకే వెళ్లి ఈ క్రాపులో నమోదు చేస్తున్నారు. 
 
జోరుగా నమోదు ప్రక్రియ
జిల్లాలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, సెరీకల్చర్‌కు సంబంధించి సాధారణ సాగు విస్తీర్ణం 1,90, 727 ఎకరాలు ఉంది. ఇందులో పలు రకాల పంటలు దాదాపు 60 వేల ఎకరాలకు పైగా సాగైంది. వీటికి సంబంధించి ప్రస్తుతం ఈ పక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా మూడు పంటలు కలుపుకుని దాదాపు 40 వేల ఎకరాల్లో ఈ–క్రాప్‌ నమోదు జరిగింది. ఈ క్రాపు నమోదులో రాష్ట్రంలో వైఎస్సార్‌జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రాపు నమోదు కోసం రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్‌నంబర్లు, భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. వీఏఏలు ఆధార్‌ బేస్‌ డేటాను అనుసంధానం చేసి ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ పక్రియను సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  

ఇవీ ప్రయోజనాలు... 
పంట నమోదు వల్ల వరదలు, తుపాన్ల సమయంలో పంటలకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతోంది. పంటల బీమా కావాలన్నా, సున్నా వడ్డీకి పంట రుణాలు కావాలన్నా రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవాలన్నా ఈ క్రాప్‌లో నమోదు తప్పనిసరి. పండించిన పంట ఉత్పత్వులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా ఈ క్రాప్‌ చేసి ఉండాలి. కౌలు రైతులు విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లకు తమ వివరాలు అందజేసి పంట నమోదు చేసుకోవచ్చు.  

రైతులందరూ ఈ క్రాప్‌ నమోదు చేసుకోవాలి 
జిల్లాలో రైతులందరూ ఈ క్రాప్‌ నమోదు చేయించుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది.జిల్లాలో ఈ ప్రక్రియ పక్రియ పకడ్బందీగా జరుగుతోంది. వరదలు, తుపాన్లు వచ్చి పంట నష్టపోయిన సమయంలో ఈ క్రాప్‌ చేయించుకుని ఉంటే ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందుతుంది. పంటలు సాగు చేసిన ప్రతి రైతు కచ్చితంగా ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలి.   
– అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి

మరిన్ని వార్తలు