మూడు నెలల్లో వైఎస్సార్‌ ఈఎంసీ ప్రారంభం

28 Jun, 2021 05:27 IST|Sakshi
కొప్పర్తి వైఎస్సార్‌ ఈఎంసీలో శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులు

శరవేగంగా సాగుతున్న పనులు 

మొత్తం 540 ఎకరాల్లో రూ.748.76 కోట్లతో క్లస్టర్‌ అభివృద్ధి 

రూ.10 వేల కోట్ల పెట్టుబడులొస్తాయని అంచనా 

లక్ష మందికి పైగా ఉపాధి కల్పన 

ఇప్పటికే రూ.1,850 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ) మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ.63 కోట్లతో ఏపీఐఐసీ పిలిచిన టెండర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి విడతలో ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పనిచేసుకునే విధంగా ఒక్కొక్కటి 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు భవనాలను నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే రెండు నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. అంతర్గత రహదారుల నిర్మాణం, వీధి దీపాలు, ముఖద్వారం నిర్మాణం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు సోమశిల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌కు ఇప్పటికే ఆమోదం లభించింది. అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 540 ఎకరాల్లో రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్‌ ఈఎంసీలో కంపెనీలకు స్థలాలను కేటాయించడానికి 310.12 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. 

పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు 
ఈ వైఎస్సార్‌ ఈఎంసీ ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే రూ.1,850 కోట్ల మేర పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈఎంసీ యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తొలి దశలో రూ.150 కోట్లతో సెక్యూరిటీ కెమెరాలు, ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీని ద్వారా 1,500 మందికి ఉపాధి లభించనుంది. అదే విధంగా కార్బన్‌ కంపెనీ రూ.200 కోట్లతో ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. హార్మోని సిటీ రూ.1,500 కోట్లతో వైఎస్సార్‌ ఈఎంసీలో మౌలికవసతులు అభివృద్ధి చేయనుంది.   

మరిన్ని వార్తలు