అర్హులైన రైతులందరికీ ఉచిత పంటల బీమా పరిహారం

22 Jun, 2022 08:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఖరీఫ్‌–2021లో పంట నష్టపోయిన రైతులందరికీ డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం అందించి న్యాయం చేస్తామని కలెక్టర్‌ నాగలక్ష్మి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగా పలువురు రైతులకు పంటల బీమా రాలేదని వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు.

 రాష్ట్రంలోనే పంటల బీమా పరిహారం అనంతపురం జిల్లాకు అత్యధికంగా రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. చాలాచోట్ల వేరుశనగ పంటకు బీమా రాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాస్తవానికి ఈ–క్రాప్‌ నిబంధనల ప్రకారం అన్ని పంటలకూ ఇస్తారని స్పష్టం చేశారు. అర్హత ఉన్నా బీమా రాని రైతులకు కచ్చితంగా పరిహారం వచ్చేలా చేస్తామని తెలిపారు. అలాంటి రైతులు ఆర్బీకేలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని ఇదివరకే సూచించామని చెప్పారు. అర్జీలు ఇచ్చుకోవడానికి 15 రోజులు గడువు ఇస్తున్నామన్నారు. 

ఎరువులు ఇబ్బంది లేకుండా.. 
ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. లక్షలాదిమంది రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 1.02 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 33.36వేల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెపె్టంబర్‌ వరకు ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి నెలవారీ ఎరువులు సేకరిస్తున్నామన్నారు. ఒక్క యూరియానే 37వేల టన్నులకు పైగా అవసరం ఉందని, కాంప్లెక్స్, 9వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ, ఎంఓపీ 9618 టన్నుల అవసరం ఉన్నట్టు గుర్తించామన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల లభ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు.  

గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. 
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పంటల బీమా పరిహారం ‘అనంత’కు వచ్చింది. రాష్ట్ర     వ్యాప్తంగా ఖరీఫ్‌–2021లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌ ఉచిత     పంటల బీమా   కింద ప్రభుత్వం రూ.2977.82 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఉమ్మడి ‘అనంత’కు అత్యధిక మొత్తం వచ్చింది. అనంతపురం జిల్లాలో 2,32,580 మంది రైతులకు రూ.629.77 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 1,71,881 మంది రైతులకు రూ.255.78 కోట్లు విడుదలైంది.

ఇది కూడా చదవండి: మారవా.. నారాయణా!

మరిన్ని వార్తలు