జనహృదయాల్లో రాజన్న సుస్థిరం

9 Jul, 2021 04:05 IST|Sakshi
వైఎస్సార్‌ విగ్రహానికి నేతల నివాళులు

ప్రభుత్వ సలహాదారు సజ్జల 

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి

సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి, సంక్షేమబాటలో నడిపించిన  చరితార్థుడని కీర్తించారు. ఆ తండ్రి వారసుడిగా, ఆయన ఆశయాలే ఊపిరిగా వైఎస్‌ జగన్‌ ప్రజల ముందుకొచ్చారని తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మొక్కలు నాటారు. బందెల కిరణ్‌రాజు ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కడపకు చెందిన తేజశ్రీ బాలకృష్ణ పెన్సిల్‌తో ప్రత్యేకంగా గీసిన వైఎస్‌ కుటుంబసభ్యుల ఫొటో ఎగ్జిబిషన్‌ను సజ్జల ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి రచించిన ‘మరువలేని మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.   

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం 
అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టినప్పుడే తమ వైఖరేంటో స్పష్టంగా చెప్పామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, దీనికి అడ్డం వచ్చే దేన్నీ వైఎస్‌ జగన్‌ స్వాగతించరని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, జంగా కృష్ణ్ణమూర్తి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు