శరవేగంగా సెంచురీ ప్లైబోర్డ్స్‌ పరిశ్రమ పనులు

23 Nov, 2022 18:21 IST|Sakshi

రూ. 956 కోట్లతో గోపవరం వద్ద పరిశ్రమ ఏర్పాటు 

589.23 ఎకరాల్లో ఇండస్ట్రీ

2021 డిసెంబరు 23న శంకుస్థాపన చేసిన సీఎం

వచ్చే ఏప్రిల్‌ నాటికి మొదటి దశ పనులు పూర్తి

2662 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు

10 వేల మంది రైతులకు పరోక్ష ఉపాధి 

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని గోపవరం వద్ద ఏర్పాటు చేస్తున్న సెంచురీ ప్లైబోర్డ్స్‌ పరిశ్రమ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2021 డిసెంబరు 23న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేయగా, 2023 ఏప్రిల్‌ నాటికి పరిశ్రమ మొదటిదశ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. తర్వాత అదే ఏడాది అక్టోబరు నాటికి రెండవ దశ పనులు సైతం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. 589.23 ఎకరాల్లో బద్వేలు నియోజకవర్గంలోని కృష్ణపట్నం–బళ్లారి ప్రధాన రహదారిలో గోపవరం వద్ద రూ. 956 కోట్లతో సెంచురీ ప్లైబోర్డ్స్‌ పరిశ్రమను నెలకొల్పుతున్నారు. ఈ పరిశ్రమలో ఎండీఎఫ్‌ (మీడియం డెన్‌సిటీ ఫైబర్‌ బోర్డ్స్‌), హెచ్‌పీఎల్‌ (హై ప్రెజర్‌ ల్యామినేట్స్‌) ఉత్పత్తులను తయారు చేయనున్నారు. సుబాబుల్, జామాయిల్, సర్వి తదితర కర్ర ద్వారా ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నారు. 

పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ జిల్లా, నెల్లూరు జిల్లాల సరిహద్దుతోపాటు అటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో జామాయిల్, సుబాబుల్, సర్వి కర్రను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో జామాయిల్‌ సాగు ఉండగా, 30 వేల ఎకరాల్లో సుబాబుల్‌ కర్ర సాగు ఉంది. వైఎస్సార్‌ జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సుబాబుల్, జామాయిల్‌ సాగు ఉంది. నెల్లూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్‌ను రైతులు సాగు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోనూ 20 వేల ఎకరాల్లో సాగు ఉంది. దీంతోపాటు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో లక్షా 21 వేల ఎకరాల్లో జామాయిల్‌ను సాగు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.  


రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క శ్రీకాళహిస్తిలో గ్రీన్‌ ప్లైవుడ్‌కు సంబంధించి చిన్న పరిశ్రమ ఉండగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు వద్ద మరో చిన్న పరిశ్రమ మాత్రమే ఉంది. పై ఆరు జిల్లాల్లో సాగవుతున్న జామాయిల్, సుబాబుల్‌ కర్ర వినియోగానికి ఈ పరిశ్రమల స్థాయి సరిపోవడం లేదు. దీంతో రాజమండ్రి వద్ద ఉన్న ఏపీ పేపర్‌ మిల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని మిల్లులకు ఈ ప్రాంతాల నుంచి కర్ర తరలించాల్సి వస్తోంది. డిమాండ్‌ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో ఏడాదికేడాదికి జామాయిల్, సుబాబుల్‌ సాగును రైతులు తగ్గిస్తున్నారు. గోపవరం వద్ద భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండడంతో ఆరు జిల్లాల పరిధిలో సాగవుతున్న కర్రను స్థానికంగానే వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించనుంది.  

రోజుకు 4 వేల టన్నుల కర్ర వినియోగం 
ఈ సెంచురీ ప్లైబోర్డ్స్‌ పరిశ్రమకు మొదటి ఫేజ్‌లో ప్రతిరోజు 2 వేల టన్నుల కర్ర అవసరం కాగా, రెండవ ఫేజ్‌ నాటికి 4 వేల టన్నుల కర్ర అవసరమవుతుంది. ఈ ప్రాంతంలో కర్రసాగు అధికంగా ఉండడంతో యాజమాన్యం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.  

వేలాది మందికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలు 
పరిశ్రమల ఏర్పాటుతో 2266 మంది చదువుకున్న నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. దీంతోపాటు కర్రసాగు ద్వారా దాదాపు 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశ్రమను నిర్మిస్తుండగా, పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి 30 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. పరిశ్రమకు విద్యుత్, నీటి సరఫరా పనులకు సంబంధించి టెండర్లు పూర్తి కాగా, ఇప్పటికే పనులు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఈ పనులన్నీ పూర్తి కానున్నాయి. 


ఏప్రిల్‌ నాటికి మొదటి దశ పనులు

సెంచురీ  ప్లైబోర్డ్స్‌ పరిశ్రమ పనులు అత్యంత వేగంగా  సాగుతున్నాయి. విద్యుత్, నీటి సరఫరాకు సంబంధించిన పనులను ఏపీఐఐసీ మరింత వేగంగా చేపట్టింది. వచ్చే ఏప్రిల్‌ నాటికి మొదటి ఫేజ్‌ పనులను పూర్తి చేయబోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబరు నాటికి రెండవ ఫేజ్‌ పనులు పూర్తవుతాయి. 
– రమేష్‌కుమార్‌రెడ్డి, జీఎం, సెంచురీ ప్లైబోర్డ్స్‌  


సీఎం చొరవతో పరిశ్రమ ఏర్పాటు 

వెనుకబడిన బద్వేలు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపించి కృషి చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మంసాగర్‌ ద్వారా నియోజకవర్గంలోని మొత్తం ఆయకట్టుకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న ముఖ్యమంత్రి గోపవరం వద్ద పరిశ్రమను నెలకొల్పి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా సంతోషదాయకం.     
– డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ  


పరిశ్రమ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 

గోపవరం వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడమే కాకుండా వేలాది మంది రైతులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమతో జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో సుబాబుల్, జామాయిల్‌ కర్ర సాగు చేస్తున్న రైతులకు స్థానికంగానే గిట్టుబాటు ధర లభించనుంది.     
– డాక్టర్‌ దాసరి సుధ, ఎమ్మెల్యే, బద్వేలు  

మరిన్ని వార్తలు