బద్వేల్‌ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు: సజ్జల

4 Oct, 2021 13:57 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌,కడప: బద్వేల్‌ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్రమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, ప్రతి ఎన్నిక విశ్వసనీయతను తెలిపే విధంగా ఉండాలని సూచించారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని స్పష్టం చేశారు. అందువల్లే తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

చదవండి: 'గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు'

నిబద్ధత, విశ్వసనీయతతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన కార్యక్రమాలే తమకు అధికారం అందించాయని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వ్యవస్థలో మార్పులు అభివృద్ధి వైపు నడిపిస్తున్నాయని, ప్రజలకు నేరుగా సంక్షేమం అందిస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేవిధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని వర్గాలకు సమానంగా అన్ని విభాగాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్యరంగంలో సమూల మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తీవ్ర ఆర్థికభారం, కోవిడ్‌ను కూడా అధిగమించి ప్రభుత్వం పనిచేసిన తీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు.

‘ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరికి జరిగిన ప్రయోజనం తెలియజెప్పే అవకాశం మనకు బద్వేలు ఉపఎన్నికల రూపంలో వచ్చింది. ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు చేసిన కార్యక్రమం గురించి వివరించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలి. పోటీలో ఎవరు వున్నా మన ప్రచారం, ఎన్నికల కార్యక్రమం సాగాలి. ఓటు ఎందుకు వేయాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎందుకు అండగా ఉండాలి అన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి’  అని సూచించారు.

మరిన్ని వార్తలు