వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వ దీవెన

1 Oct, 2022 04:33 IST|Sakshi

నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ  

మార్గదర్శకాలు విడుదల

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు

ఏడాదిలో నాలుగు విడతలుగా నేరుగా నగదు బదిలీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదోళ్ల ఆడ బిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం నగదు దీవెనలు అందించనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు(బీవోసీడబ్ల్యూడబ్ల్యూబీ) కుటుంబాలకు చెందిన ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.  ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.

మూడు నెలలకోసారి నగదు 
పేద ఆడ బిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం కోరుతూ ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రతి మూడు నెలలకోసారి(క్వార్టర్లీ) పరిశీలించి అప్పటి వరకూ నిర్ణయించిన అర్హులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు తమ జీవిత భాగస్వామిగా తమ కులానికి చెందిన వారిని ఎంచుకుంటే నిర్దేశిత మొత్తం, ఇతర కులాలకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటే అంతకంటే అధిక పారితోషికం వస్తుంది.  దివ్యాంగులకు సంబంధించి ఇద్దరూ వైకల్యం ఉన్నవారైనా, ఒక్కరే వైకల్యం ఉన్నావారైనా సరే ఆడపిల్లకు మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. 

వధువు వయస్సు 18 ఏళ్లు నిండాలి
ప్రభుత్వ నగదు ప్రోత్సాహం పొందే వివాహాల్లో వధువుకు 18 ఏళ్లు, వరుడుకి 21 ఏళ్లు వయస్సు నిండాలి. కనీసం పదో తరగతి పాస్‌ అయ్యి ఉండాలి. ఆడపిల్లకు మొదటి పెళ్లికి మాత్రమే నగదు ప్రోత్సాహం అందుతుంది. భర్త చనిపోయిన సందర్భంలో వితంతువుకు మినహాయింపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు నెలసరి ఆదాయం కలిగిన వారు అర్హులు.

మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల మెట్ట, మాగాణి మెట్ట కలిపి 10 ఎకరాలున్న వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లకు చెందిన కుటుంబాలకు ఇది వర్తించదు. పారిశుధ్య కార్మిక కుటుంబాలకు మినహాయింపు ఉంది. సొంతంగా నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హత లేదు. ట్యాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లున్న వారికి మినహాయింపునిచ్చారు. నెలకు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి. లబ్ధి పొందాలనుకునే కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన నిర్మాణ ఆస్తి కలిగి ఉండకూడదు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దేశించిన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తగిన ధ్రువపత్రాలు, వివరాలు తీసుకెళితే.. డిజిటల్‌ అసిస్టెంట్‌(డీఏ)/వార్డు వెల్ఫేర్, డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ(డబ్ల్యూడీపీఎస్‌)లు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌  http://gsws-nbm.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పలు దశల్లో అధికారులు పరిశీలించడంతోపాటు క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హులను నిర్ధారిస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు