అర్హులందరికీ ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’

8 Nov, 2020 02:47 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి వేణు. చిత్రంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా

కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారుల సంఖ్య 95,245 

వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం(రూ.కోట్లలో) 142.87

కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి డబ్బు జమ చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ

గతంలో 2,35,360 మంది లబ్ధిదారులకు రూ.353 కోట్లు జమ

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో భాగంగా కొత్తగా అర్హులైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం విజయవాడలో ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు. మొదటి విడతలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేయని వారికి, అందుబాటులో లేని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా 95,245 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించి రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను విడుదల చేయడం తెలిసిందే. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందించినట్లైంది. 
లబ్ధిదారులకు చెక్కు ఇస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌  జక్కంపూడి తదితరులు 

అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి తావులేని విధంగా పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శ పాలకుడిగా నిరూపించుకున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ రిజర్వేషన్‌ల నుంచి 5% కాపులకు ఇస్తున్నానని చెప్పి వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపులు వారి సమస్యలపై ఉద్యమిస్తే.. కేసులు పెట్టి వేలాది మందిని చంద్రబాబు జైళ్లలో పెట్టించారని, ఆ కేసులన్నీ ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తివేశారని తెలిపారు. 16 నెలల కాలంలో కాపులకు రూ.5,542 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్‌దేనన్నారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా మేనిఫెస్టో అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన కాపు మహిళలు శ్రీనివాసమ్మ, రమాదేవి, పి.లక్ష్మి మాట్లాడుతూ కాపులకు వరాల జల్లు కురిపించింది వైఎస్‌ జగన్‌ ఒక్కరేనన్నారు. కాపు కార్పొరేషన్‌ ఎండీ శ్రీనివాస శ్రీనరేష్‌ అధ్యక్షత వహించగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు