సాగుకు భరోసా

18 Apr, 2022 23:38 IST|Sakshi

ఈసారి ఖరీఫ్‌కు ముందే జమకానున్న రైతు భరోసా

అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం చేసేందుకు కసరత్తు

ఆర్బీకేల్లో అర్హుల జాబితా

సాక్షి,కదిరి(సత్యసాయిజిల్లా): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి రైతులంటే ఎంత ఇష్టమో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా అన్నదాతలంటే ప్రాణం. అందుకే వారిని ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతుభరోసా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఏటా రైతు కుటుంబానికి రూ.13,500 నగదు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఈసారి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి మునుపే మే నెలలోనే వైఎస్సార్‌ రైతు భరోసా నగదు అర్హులైన రైతులందరి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు.

లబ్ధిదారు చనిపోతే ఆ ఇంట్లోనే మరొకరికి.. 
రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే ఆ నగదు అదే ఇంట్లోనే      మరొకరికి అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు    ఇచ్చింది. అలాగే కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు కూడా ఈసారి రైతు భరోసాకు అర్హులయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.  

రైతు భరోసా పొందడం ఎలా? 
భూమి ఉన్న ప్రతి రైతూ ఈ పథకానికి అర్హులే. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ప్రయోజనం పొందే వారందరూ ఈ పథకానికి అర్హులే. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డుతో పాటు బ్యాంకు పాసుపుస్తకం తీసుకొని సమీప రైతుభరోసా కేంద్రంలో సంప్రదిస్తే సరిపోతుంది. లేదంటే వలంటీర్‌ను గానీ, గ్రామ సచివాలయంలో గానీ, వ్యవసాయాధికారిని గానీ సంప్రదించవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం రూ.13,500ను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందులో రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం జమచేయగా, దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 జమ చేస్తుంది. 

రైతులకు నిజంగా భరోసానే 
జగన్‌ ప్రభుత్వం రైతులకు ఏటా అందజేసే రైతు భరోసా నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఒకప్పుడు విత్తనాల కొనుగోలుకు చేతిలో డబ్బు లేక పొలాలు బీళ్లుగా వదిసే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా నగదు పెట్టుబడికి సాయంగా ఉంటోంది. 
– రైతు జగన్‌మోహన్‌రెడ్డి, ఓబుళరెడ్డిపల్లి, తలుపుల మండలం 

అర్హులెవ్వరూ నష్టపోరాదు 
వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించి అర్హులైన ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితా రైతు భరోసా కేంద్రాల్లో సిద్దంగా ఉంది. రైతులు పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు లేకపోతే అక్కడే చెబితే వెంటనే న్యాయం చేస్తాం. 
– జి.శివనారాయణ, జేడీఏ, శ్రీసత్యసాయి జిల్లా
 

మరిన్ని వార్తలు