వడివడిగా వ్యవసాయం

12 Jul, 2021 02:23 IST|Sakshi

విస్తారంగా వానలు..17.1 శాతం అధిక వర్షపాతం

వైఎస్సార్‌ రైతు భరోసా, ఆర్‌బీకేల ప్రోత్సాహం

ఇప్పటికే 8.06 లక్షల ఎకరాల్లో సాగు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగు వడివడిగా సాగుతోంది. సాగుకు ముందే వైఎస్సార్‌ రైతు భరోసా కింద తొలివిడత పెట్టుబడి సాయం అందించడం, ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులను కూడా ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచడం, విస్తారంగా వానలు కురుస్తుండడంతో రైతులు ఉత్సాహంతో ఏరువాకకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది 94.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 8.06 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా కృష్ణాలో 1,19,810 ఎకరాల్లో సాగవగా, అత్యల్పంగా తూర్పుగోదావరి జిల్లాలో 4,728 ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు సాగవుతున్నాయి.

సాధారణానికి మించి వర్షపాతం..
సీజన్‌లో ఇప్పటి వరకు సగటున 140.8 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా, జూలై 11 నాటికే 157.9 ఎంఎం వర్షం కురిసింది. అంటే  ఇప్పటికే 17.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఇప్పుడిప్పుడే ..
గతేడాది పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అన్నదాతలు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వరి నారుమళ్లు పోయడం ఊపందుకుంది. ఈసారి మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రకాలనే సాగు చేయాలని ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ శాఖ చేస్తోన్న విస్తృత ప్రచారం సత్ఫలితాలనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయాధికారులు సూచిస్తున్న రకాల సాగుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు.  

2.83 లక్షల ఎకరాల్లో వరి సాగు
వరిసాగు లక్ష్యం 39.50 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.83 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఆ తర్వాత వేరుశనగ సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటి వరకు 1.48 లక్షలు, ఇక పత్తి 14.81లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1.84 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగిలిన ప్రధాన పంటల్లో చెరకు 50 వేలు, మొక్కజొన్న 37 వేలు, నువ్వులు 28వేలు, కందులు 13వేలు, ఉల్లి 11 వేలు,. రాగులు 10వేల ఎకరాల్లో సాగయ్యాయి. మొత్తమ్మీద 28 వేల ఎకరాల్లో అపరాలు, 3.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలు, 1.82 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ సీడ్స్‌ సాగవగా, ఇతర పంటలు 2.62లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గడచిన రెండు సీజన్‌ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్ధేశించిన లక్ష్యానికి మించి సాగు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు