ఖరీఫ్‌కు ముందే ‘వైఎస్సార్‌ రైతు భరోసా’

15 May, 2022 16:33 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు, కొరిటెపాడు: భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతులు ఖరీఫ్‌కు సమాయత్తమవుతుండగా ముందుగానే పెట్టుబడి సాయం అందించేందుకు రంగం సిద్ధం చేసింది. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి గాను ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ నగదు అందజేసేందుకు వ్యవసాయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి అర్హులైన అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. గుంటూరు జిల్లాలో 1,12,843  మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద రూ.84.63 కోట్లు జమ కానుంది. పల్నాడు జిల్లాలో 2,43,492 మంది రైతులకుగాను రూ. 182.62 కోట్ల జమ కానున్నాయి. బాపట్ల జిల్లాలో 1,63,692  మంది రైతులకు రూ. 122.76 కోట్ల లబ్ధి  కలగనుంది. 

ముందస్తుగా సాయం... 
ఖరీఫ్‌ సాగులో దుక్కులు దున్నేందుకు, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తోంది.

ఇందులో భాగంగా 2022–23 సంవత్సరానికి ఎంపికైన రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలి విడతగా సోమవారం పీఎం కిసాన్‌తో కలిపి రూ.7,500 జమ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓలు, సచివాల య అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు గ్రామాల్లో రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు.  

అర్హులందరికీ వర్తించేలా... 
వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. ఎలాంటి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు, దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న రైతులకు రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.  

ధీమాతో సాగుకు సై... 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేలా విత్తు మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతకు అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తోంది.    బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తుండటంతో రైతులు ధీమాతో సాగుకు సై అంటున్నారు. 

(చదవండి: ప్రాణాలను సైతం లెక్కచేయని సేవామూర్తులకు శుభాకాంక్షలు: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు