Rythu Bharosa Kendras: ‘చాంపియన్‌’.. ఆర్బీకే!

2 May, 2022 03:06 IST|Sakshi

ఐరాస విశిష్ట అంతర్జాతీయ పురస్కారానికి నామినేషన్‌

మన దేశం తరఫున ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం

అంతర్జాతీయ ఖ్యాతి దిశగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు

ఆర్బీకే వ్యవస్థకు రూపకల్పన చేసిన సీఎం జగన్‌.. గ్రామగ్రామాన అన్నదాతకు సమస్త సేవలు

రెండేళ్లలోనే గ్రామస్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు

సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో).. అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత, ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్‌’’ అవార్డుకు ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేయడం గమనార్హం.

గ్రామగ్రామాన రైతన్నకు భరోసా
వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం.. పేరుకు తగ్గట్టుగానే ప్రతి గ్రామంలో అన్నదాతకు అండదండగా నిలుస్తోంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే రైతులకు అన్ని రకాల సేవలందిస్తున్న ఓ వినూత్న, విప్లవాత్మక వ్యవస్థ ఇది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఈ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిన ఆర్బీకేలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుకు నామినేట్‌ అయ్యాయి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన ఆర్బీకేలను మన దేశం తరపున ఐరాస అనుబంధ సంస్థ ఎఫ్‌ఏవో అందించే ఛాంపియన్‌ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.

రెండేళ్ల క్రితం రూపుదిద్దుకుని..
ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పం మేరకు రాష్ట్రంలో సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. 2020 మే 30న శ్రీకారం చుట్టిన ఈ ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన సమస్త సేవలన్నీ రైతులకు అందిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు.. ఇలా నాణ్యమైన సాగు ఉత్పాదకాలన్నీ అందించడమే కాకుండా రైతు పండించిన పంటను కూడా నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దిన ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను సందర్శించి వాటి సేవలను ప్రశంసించాయి. తాజాగా ఎఫ్‌ఏవో అందించే ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ కావడం మరో అరుదైన గౌరవమని అధికారులు పేర్కొంటున్నారు.

‘ఆహార భద్రత – 2030’ లక్ష్యం..
ప్రపంచవ్యాప్తంగా మానవాళి చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ‘ఆహార భద్రత – 2030’ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్‌ఏవో కృషి చేస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోంది. అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్‌ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు, ప్రభుత్వాలను ఏటా అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూఎస్‌ డాలర్లను అందజేస్తారు. 

పలు దశల్లో వడపోత..
ప్రతిష్టాత్మక ఛాంపియన్‌ అవార్డు కోసం ఎఫ్‌ఎవో అంతర్జాతీయంగా నామినేషన్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా గ్రామస్థాయిలో సేవలందిస్తున్న వైఎస్సార్‌ ఆర్బీకేలను రోల్‌ మోడల్‌గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మన దేశం తరపున ఈ అవార్డు కోసం ఎఫ్‌ఏవోకు నామినేట్‌ చేసింది. అందరికీ సుస్థిర ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో అనుసరిస్తున్న వినూత్న విధానాలు, వ్యవస్థలు, వాటి ద్వారా వచ్చిన మార్పులు, ఉత్పత్తి, పోషకాహారం, పర్యావరణం, జీవన విధానాల్లో సాధించిన మెరుగైన ఫలితాలు లాంటి అంశాలను అవార్డుకు ప్రామాణికంగా తీసుకుంటారు. వివిధ దేశాల నుంచి అందిన నామినేషన్లను వివిధ దశల్లో వడపోస్తారు. చివరిగా అంశాల వారీగా అర్హత కలిగిన సంస్థలు, ప్రభుత్వాలను ఐరాస అత్యున్నత కౌన్సిల్‌ ఎంపిక చేస్తుంది. జూన్‌ 13 నుంచి 17వతేదీ వరకు ఐక్యరాజ్య సమితిలో జరిగే ఎఫ్‌ఏవో 169వ కౌన్సిల్‌ సమావేశంలో డైరెక్టర్‌ జనరల్‌ చేతుల మీదుగా ఎంపికైన సంస్థలు / ప్రభుత్వాలకు ఛాంపియన్‌ అవార్డును ప్రదానం చేస్తారు. 

అందరికీ ఆదర్శం...
ఆర్బీకే వ్యవస్థ వినూత్నం, విప్లవాత్మకం. దేశమంతా అమలు చేయతగ్గ ఓ ప్రయోగం. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేలా సిఫార్సు చేస్తాం. ఆర్బీకేలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. వీటి పనితీరును మరింత మెరుగు పరిచేందుకు లోతైన అధ్యయనం కూడా చేస్తుంది.
– డాక్టర్‌ ఏకే సింగ్, ఐసీఎంఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌

దేశమంతా అనుసరించాలి...
ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలు జాతీయ స్థాయిలో అమలు చేయతగ్గవి. ఈ– క్రాప్‌ ద్వారా పంటలవారీగా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను నమోదు చేస్తున్న తీరు బాగుంది. వాస్తవ సాగుదారులకు పంట రుణాలతో పాటు అన్నిరకాల రాయితీలు అందేలా ఈ–క్రాప్‌ను ఈ కేవైసీతో అనుసంధానించడం మంచి ఆలోచన. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకేల్లో గ్రామస్థాయిలో బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి 
తేవడం గొప్ప విషయం. ఈ తరహా ప్రయత్నం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు చూడలేదు. 
– కయా త్రిపాఠి, సోనాలి సేన్‌ గుప్తా, ఆర్బీఐ సీజీఎంలు

మనకు గర్వ కారణం...
అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్‌ఏవో అందజేసే ఛాంపియన్‌ అవార్డుకు మన ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేయడం గర్వకారణం. ఎఫ్‌ఏవో కంట్రీ హెడ్‌ టోమియో షిచిరీ బృందం గతంలో ఆర్బీకేలను స్వయంగా పరిశీలించి ప్రశంసించింది. ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సాంకేతిక సామర్థ్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ప్రపంచంలో మరెక్కడా లేని ఆర్బీకేల వ్యవస్థకు ఛాంపియన్‌ అవార్డు కచ్చితంగా వస్తుందన్న నమ్మకం ఉంది.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ

ఇలాంటి వ్యవస్థ ఇంకెక్కడా లేదు..
ఆర్బీకే  లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే స్టూడియోలు ఓ వినూత్న ఆలోచన. వీటి ద్వారా గ్రామస్థాయిలో రైతు ముంగిటకు నేరుగా నాణ్యమైన సేవలందించడం నిజంగా ప్రశంసనీయం. ఆర్బీకేల బలోపేతానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. 
– ఆర్బీకేల సందర్శన సందర్భంగా టోమియో షిచిరీ, ఎఫ్‌ఏవో కంట్రీ హెడ్‌ 

మరిన్ని వార్తలు