అన్న‌దాత‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

12 May, 2021 18:07 IST|Sakshi

అమరావతి: ఈ కరోనా కష్టకాలంలో అన్న‌దాత‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖ‌రీప్ పంట‌కాలానికి చెందిన వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ ఈ ఆర్దిక సంవత్సరానికి చెందిన తొలి విడత సాయాన్ని రేపు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ పథకం’ కింద అందించే ఈ ఏడాది మొదటి విడత సొమ్ము రూ.7,500లను రైతుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ లాంఛనంగా విడుదల చేయ‌నున్నారు. తొలి విడతగా రూ.3,882.23 కోట్లను 52.38 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్ర‌భుత్వం. కోవిడ్ కష్టకాలంలోనూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు అండగా ఉండాల‌ని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు.

ఈ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారు. 2019-20 సంవత్సరం నుంచి సీఎం జగన్ ప్ర‌భుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. తొలి విడత మేలో రూ.7,500, రెండో విడత అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2 వేల చొప్పున అన్న‌దాత‌ల‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అద‌నంగా మ‌రికొంత‌మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.13,101 కోట్ల సీఎం జగన్ ప్రభుత్వం అందించింది. రేపు విడుదల చేసే నిధులతో కలిపి ఈ మొత్తం రూ.16,983.23 కోట్లు కానుంది. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.67,953.76 కోట్ల సాయం అందించారు. అలాగే, ఈ నెలలోనే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించనుంది.

చదవండి:

కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

మరిన్ని వార్తలు