‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్‌ రైతు భరోసా’

29 Apr, 2021 08:48 IST|Sakshi

ఆంధ్రాలో భూములున్న వారికి వర్తింపు

865 మందికి లబ్ధి

సాక్షి, అమరావతి: ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్‌ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు  2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా లబ్ధి అందనుంది. యానాంకు చెందిన 865 మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములున్నాయి. ఒక్కొక్కరికీ రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.7,500 జమ చేయనున్నారు. మొదటి విడతగా మే 13న ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు రూ.5,500 వేల చొప్పున ఆ రైతులకూ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆనందంగా ఉంది
నాకు యానాంలో ఐదెకరాలుంది. ఆంధ్రా పరిధిలో రెండెకరాలుంది. వైఎస్సార్‌ రైతు భరోసాకు గతంలో దరఖాస్తు చేశా. ఆధార్‌ కార్డు యానాం అడ్రస్‌తో ఉండడంతో నాన్‌ రెసిడెంట్‌ అంటూ రైతు భరోసా వర్తింప చేయలేదు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు భరోసా వర్తింప చేయాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. 
– కోన సత్తియ్య, రైతు, యానాం

సీఎం కీలక నిర్ణయంతో..
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు ఏపీలో పలుచోట్ల భూములున్నాయి. స్థానికంగా నివసించని కారణంగా వారికి వైఎస్సార్‌ రైతు భరోసా వర్తించదు. అయినప్పటికీ  వైఎస్సార్‌ రైతు భరోసా వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చెందిన 865 మంది రైతులకు  లబ్ధి చేకూరనుంది.   
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ

చదవండి: ఏపీ: షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు 
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి

మరిన్ని వార్తలు