ప్రభుత్వం ప్రత్యేక చొరవ... ఐరన్, పోలిక్‌ ఆమ్లం, విటమిన్‌ బీ12 పోషకాలున్న ఫోర్టిఫైడ్‌ బియ్యం

25 Oct, 2022 07:45 IST|Sakshi
ఫోర్టిఫైడ్‌ బియ్యం

కళ్యాణదుర్గం (అనంతపురం): తల్లి గర్భం నుంచే శిశువు ఆరోగ్య పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇందులో భాగంగా  సాధారణ బియ్యానికి అదనంగా ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు జోడించి ఇవ్వడం వల్ల శిశువు, ఎదిగే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యాధులతో పోరాడేందుకు తగిన శక్తినిచ్చే పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని అంగన్‌వాడీ కేంద్రాల అందిస్తోంది.  

ప్రతి నెలా క్రమం తప్పని పోషకాలు.. 
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కేజీల ఫోర్టిఫైడ్‌ బియ్యం, 1 కేజీ కందిపప్పు, అర లీటరు నూనె, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అందజేస్తోంది. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 2 కిలోల ఫోర్టిపైడ్‌ బియ్యం, అర కేజీ కందిపప్పు, 150 మి.మీల నూనె, 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 25 కోడిగుడ్లు, 2.5 లీటర్ల పాలు ప్రతి నెలా అంగన్‌వాడీ కార్యకర్త నేరుగా లబ్దిదారుల ఇంటికెళ్లి అందజేసేలా చర్యలు తీసుకున్నారు.  
(చదవండి: బొమ్మేస్తే అచ్చు దిగాల్సిందే..!)

పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. 
బియ్యంలో ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. సూక్ష్మ పోషకాల స్థాయిని మరింత పెంచేందుకు ఆ బియాన్ని పొడి చేసి ఆ పొడిలో ఐరన్, ఫొలిక్‌ యాసిడ్, విటమిన్‌ బీ 12 వంటి ఖనిజాలు అదనంగా చేర్చి మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్‌ రైస్‌ (బలవర్థకమైన బియ్యం) అని పిలుస్తారు. చిన్నారులు, గర్బిణులు, బాలింతలకు కీలకమైన సూక్ష్మ పోషకాలను బియ్యంలో అదనంగా చేర్చి అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని అధికమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసులకు అనుగుణంగా..  
ఫోర్టిఫైడ్‌ బియ్యం రంగు, రుచి, రూపంలో సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం రక్తహీనతను అధిగమించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. జింక్, విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ 12, ఫొలిక్‌ యాసిడ్‌ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందజేస్తుంది. దీని వల్ల నాడీ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసుల మేరకు జగన్‌ ప్రభుత్వం కూడా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని  ఉచితంగా అందజేస్తోంది.
(చదవండి: అపోహలు వద్దు.. ఆరోగ్యమే ముద్దు)

రక్తహీనతను తగ్గిస్తుంది 
ఫోర్టిపైడ్‌ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. చిన్నారులకు సంపూర్ణ పోషకాలను అందజేసినట్లవుతుంది. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఈ బియ్యాన్ని డ్రై రేషన్‌ కింద అందించేందుకు చర్యలు తీసుకున్నాం.  
– శ్రీదేవి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ఐసీడీఎస్‌   

మరిన్ని వార్తలు