ఏపీలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం

19 May, 2022 19:22 IST|Sakshi

తొలిదశలో రూ.143 కోట్లతో 175 అంబులెన్స్‌లు

టోల్‌ ఫ్రీ నంబరు 1962కు ఫోన్‌చేస్తే చాలు రైతు ముంగిటే సేవలు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రారంభించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలు నేటి (గురువారం) నుంచి అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తుండగా.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

మలిదశలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్‌ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంబులెన్స్‌ సేవల కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశారు.

ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్‌లు విజయవాడ నున్న సమీపంలోని ముస్తాబాద శివారు ప్రాంతంలో బారులు తీరి ఉన్నాయి. 

అంబులెన్స్‌లో సౌకర్యాలు..
► ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు. 
► 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల.
► అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ సౌకర్యం
► ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు
► అవసరమైతే హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం. 

మరిన్ని వార్తలు