పండుగలా వైఎస్సార్‌ సున్నా వడ్డీ ఉత్సవం

24 Apr, 2022 03:07 IST|Sakshi
విజయవాడలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న స్వయం సహాయక సంఘం మహిళలు

సీఎం జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ సున్నా వడ్డీ ఉత్సవాలు శనివారం రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వారిలో సీఎం జగన్‌ తర్వాతే ఎవరైనా అని నినాదాలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించి వరుసగా మూడో ఏడాది ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.

ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ పాల్గొని మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్‌ యార్డులో జరిగిన ఉత్సవానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళ సుబ్బారావు నగర్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తదితరులు, కృష్ణా జిల్లా గూడూరులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ మహిళలతో కలిసి ప్లకార్డు చూపుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌ 

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సున్నా వడ్డీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది.  

మరిన్ని వార్తలు