అరటికి అందలం..ఇయర్‌ ఆఫ్‌ బనానాగా ప్రకటన

22 Oct, 2022 08:30 IST|Sakshi

అరటి అభివృద్ధికి ఉద్యాన వర్సిటీ కార్యాచరణ 

తాడేపల్లిగూడెం: మూడేళ్ల నుంచి ఉద్యాన పంటల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్నగూడెం వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ ఈ ఏడాదిని (2022–23) అరటి సంవత్సరం (ఇయర్‌ ఆఫ్‌ బనానా)గా ప్రకటించింది. ఈ మేరకు కరపత్రాలు, అధికారిక లోగోను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు కార్యరూపం ఇస్తూ విశేష కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోన్న ఉద్యాన వర్సిటీ ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల బలోపేతంలో క్రియాశీలక భూమిక పోషిస్తుంది.

వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ జానకీరాం వినూత్న ఆలోచనలతో 2020 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో పంటను ఎంచుకొని పంటల నామ సంవత్సరాన్ని ప్రకటిస్తున్నారు. 2022–23ని ఇయర్‌ ఆఫ్‌ బనానాగా ప్రకటించారు. ఎంపిక చేసిన పంటకు సంబంధించి ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన, రాష్ట్ర ప్రభుత్వ శాఖల, జాతీయ సంస్థల సమన్వయంతో, దేశంలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో అత్యంత ప్రాధాన్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. రైతులు, ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల సంయుక్త కృషితో చేసిన కార్యక్రమాలు సామాన్య ప్రజలకు కూడా ఎంతో అవగాహన కలుగుతోంది. 2020–21ని అంబాజీపేట పరిశోధనస్థానం ద్వారా ఇయర్‌ ఆఫ్‌ కోకోనట్‌గా ప్రకటించారు. 2021–22ని పెట్లూరు నిమ్మ పరిశోధన స్థానం ద్వారా నిమ్మ, నారింజ, బత్తాయిల కోసం ఇయర్‌ ఆఫ్‌ సిట్రస్‌గా ప్రకటించారు. దేశంలో విశ్వవిద్యాలయాలకు ఈ పద్ధతి నమూనాగా మారింది. 

పరిశోధనల్లో వర్సిటీ మేటి  
మహారాష్ట్ర, గుజరాత్‌లో పండించే గ్రాండ్‌నెస్‌ (పెద్దపచ్చఅరటి)కు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఇక్కడ పండించే కర్పూర, చక్కెరకేళీ, తెల్ల చక్కెరకేళీ, మార్టమస్, ఎర్ర చక్కెరకేళీ రకాలు దేశవాళీ రకాలుగా ప్రాచుర్యం పొందాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అరటి పరిశోధన స్థానం విడుదల చేసిన కొవ్వూరు బొంత, గోదావరి బొంత అరటి వంటి కూర రకాలు కూడా ఉన్నాయి. టిష్యూ కల్చర్, బిందుసేద్య పద్ధతుల ద్వారా అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో అరటి విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయి.

మూడు, నాలుగేళ్లుగా అరటి రైతులు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా గ్రాండ్‌నెస్‌ అరటి రకాన్ని సాగు చేస్తున్నారు. ఉద్యాన వర్సిటీ పరిధిలో పనిచేస్తోన్న ఉద్యాన పరిశోధన స్థానం (కొవ్వూరు) కృషి ఫలితంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. విత్తన, పిలక ఎంపిక, టిçష్యూకల్చర్‌ అరటి, సాగు, బిందు సేద్య విధానం, గెలల యాజమాన్యం, ఎరువులు, తెగుళ్ల యాజమాన్యం, కోత ముందు తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తలు వివరిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో అరటిసాగు పెరగడం వల్ల కొత్త రకాలు, ఆయా ప్రాంతాలకు అనువైన సేద్య పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నారు. 2019లో ప్రభుత్వం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో కొత్తగా 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు