15న వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం అమలు: మంత్రి పేర్నినాని

3 Jun, 2021 18:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ప్రారంభించనున్నారని మంత్రి పేర్నినాని తెలిపారు. ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయం కోసం 8 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి  ఏటా రూ.10 వేల సాయం అందిస్తారు. వైఎస్సార్‌ వాహనమిత్రకు సంబంధించిన 2 లక్షల 23 వేల 300 అర్హుల జాబితాను.. గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శించాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వాహన మిత్ర కింద ఆర్థిక సాయం అందిస్తాం.  

వేరొక పథకంలో లబ్ది పొందుతున్నవారు, ప్రభుత్వ పించన్ పొందుతున్నవారు సాయానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా  ఆదాయ పన్ను చెల్లిస్తోన్న వారు పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్నవారు  వారి ఆటో,టాక్సీతో  ఫొటో దిగి వాలంటీర్  ద్వారా అప్ లోడ్ చేయాలి. పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అర్హత ఉన్నవారికే సాయం చేస్తున్నాం. గత ఏడాది కంటే ఈ సంవత్సరం వాహనమిత్ర  లబ్ది దారుల సంఖ్య 33 వేల 223 తగ్గింది’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు