29న వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ

20 Nov, 2022 03:40 IST|Sakshi

ఆర్బీకేల్లో రబీ 2020–21 జాబితాలు 

2.54 లక్షల మంది అర్హులు.. రూ.45.22 కోట్ల లబ్ధి 

22 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం 

సిద్ధమవుతున్న ఖరీఫ్‌–2021 అర్హుల జాబితా  

సాక్షి, అమరావతి: అన్నదాతల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే లక్ష్యంతో రూ.లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీనందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. రబీ 2020–21, ఖరీఫ్‌–2021 సీజన్‌లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమ చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇప్పటికే రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో ఆదివారం (నేటి) నుంచి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. ఖరీఫ్‌–2021 జాబితా వాలిడేషన్‌ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.

అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తీసుకున్న రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీనందిస్తోంది. టీడీపీ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు చెల్లిస్తూ రైతులకు బాసటగా నిలిచింది.

2014–19 మధ్య గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమచేయడమే కాక ఖరీఫ్‌–2019లో 14.28 లక్షల మందికి రూ.289.68 కోట్లు, రబీ 2019–20లో 5.59 లక్షల మందికి రూ.92.38 కోట్లు, ఖరీఫ్‌ 2020 సీజన్‌లో 6.67లక్షల మందికి రూ.112.70 కోట్లు జమచేసింది.  

ఈ–క్రాప్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా.. 
రబీ 2020–21తో పాటు ఖరీఫ్‌–2021 సీజన్లలో రూ.లక్షలోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమచేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించనుంది. అలాగే, రబీ 2020–21 సీజన్‌లో సున్నా వడ్డీ రాయితీ పొందేందుకు 2,54,568 మంది అర్హత పొందినట్లుగా నిర్ధారించారు. వీరికి ఈ నెల 29న రూ.45.22 కోట్లు జమచేస్తారు.

జిల్లాల వారీగా వీరి జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఈనెల 22లోగా వీటిని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా చెక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నా వడ్డీ పంట రుణాల  పోర్టల్‌  https://karshak.ap.gov.in/ysrsvpr/ అనే వెబ్‌సైట్‌లో "know your status" విండోలో తమ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌చేస్తే వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

మరోవైపు.. నవంబర్‌ 29న ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హత పొందిన రైతులకు కూడా సున్నా వడ్డీ రాయితీని జమచేయనున్నారు. ఈ సీజన్‌లో పంట రుణాలు తీసుకున్న 10.76 లక్షల మంది వివరాలను బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేయగా, వారిలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ రుణం పొందడం, ఈ–క్రాప్‌లో పంటల నమోదు ప్రామాణికంగా వ్యాలిడేషన్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఖరీఫ్‌–2021 అర్హుల జాబితాను కూడా సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. 

తప్పొప్పులు సరిచేసుకోవచ్చు.. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు 
జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకుని తమ పేర్లు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ఒకవేళ అర్హత ఉండి తమ పేరు జాబితాలో లేకపోతే పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత బ్యాంకు అధికారి ధ్రువీకరణతో రైతుభరోసా కేంద్రాల్లో సమర్పిస్తే పునః పరిశీలన చేసి అర్హుల జాబితాలో చేరుస్తారు. 
    – చేవూరు హరికిరణ్,స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ   

మరిన్ని వార్తలు