వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

26 Feb, 2021 01:43 IST|Sakshi

ఆరుగురి పేర్లు ప్రకటించిన పార్టీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేసిన ఆరు పేర్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మార్చి 29 నాటికి ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. వాటిల్లో ఒకటి.. వైఎస్సార్‌   సీపీకి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామా తో కొంతకాలంగా ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానానికి 2023 మార్చి 29వ తేదీ వరకు పదవీకాలం ఉంది. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడ్డ ఖాళీకి ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది.

మిగిలిన ఐదు స్థానాల్లో అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌కు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. విజయవాడ 56వ కార్పొరేటర్‌గా సేవలందించిన కరీమున్నీసా, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య, ఇటీవల మరణించిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు కళ్యాణచక్రవర్తికి ఎమ్మెల్సీలుగా అవ కాశం కల్పించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పెట్టకూడదని, వారి సమస్యలు మండలిలో ప్రతిబింబించేలా ఆ వర్గంలోని వారికే ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించినట్టు సజ్జల తెలిపారు.  

ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
1. మహ్మద్‌ ఇక్బాల్‌
2. కరీమున్నీసా
3. సి.రామచంద్రయ్య
4. దువ్వాడ శ్రీనివాస్‌
5. బల్లి కళ్యాణచక్రవర్తి
6. చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి ఆయన కుమారుడు భగీరథరెడ్డి 

మరిన్ని వార్తలు