వరదలతో అతలాకుతలం.. ఏపీని ఆదుకోండి

18 Jul, 2022 04:35 IST|Sakshi

వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంటలకు నష్టం  

తక్షణ సాయం చేయండి 

అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి 

విభజన హామీలు త్వరితగతిన అమలు చేయాలి  

జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి 

సాక్షి, న్యూఢిల్లీ : గోదావరికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిథున్‌రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపామన్నారు. ఆయా ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా లేనంతగా ప్రస్తుతం వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, విపరీతమైన ఆస్తి, పంట నష్టం జరిగిందని సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందని తెలిపామని వివరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే.. 

పోలవరం నిధులు విడుదల చేయాలి 
► ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ ఇంకా అమలు చేయలేదు.
► పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతోంది. అందువల్ల ప్రాజెక్ట్‌ పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్‌ చేయడంలో జాప్యం నివారించాలి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్ట పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలి. 
► విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకు కాలయాపన జరుగుతోంది? త్వరగా నిర్ణయం తీసుకోవాలి.  
► రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలి. ఈ విషయాల గురించి గతంలో సంబంధిత విమానయాన, స్టీల్‌ మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశాం. 
► అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.79.72కు పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. 

 పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి  
► ఉపాధిలో మహిళల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయిన విషయాన్ని కేంద్రం గమనించాలి. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టాలి. మహిళల హక్కులు కాపాడాలి. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. 
► పార్లమెంటులో వినియోగించకూడని పదాల (అన్‌ పార్లమెంటరీ) జాబితాను లోక్‌సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపింది. 1954 నుండి ఇది ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్‌ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆనవాయితీగా ఇచ్చినవే.    

కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులివ్వాలి 
► రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాకో మెడికల్‌ కాలేజీ, జిల్లా ఆస్పత్రి ఏర్పాటులో భాగంగా కొత్తగా 12 వైద్య కళాశాలల మంజూరు ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.  
► ఇటీవల ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వారు తిరిగి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఇతర మెడికల్‌ కాలేజీలలో చదువుకోడానికి అనుమతులు ఇవ్వాలి.  
► కోవిడ్‌ కారణంగా మూడేళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతోంది. పౌర సరఫరాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. త్వరితగతిన జనాభా లెక్కలు సేకరించాలి. 

మరిన్ని వార్తలు