వైఎస్సార్‌సీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనం: సీఎం జగన్‌ హయాంలో సామాజిక న్యాయం

26 Oct, 2022 17:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యకర్మంలో బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, అన్ని కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు.


చదవండి: టీడీపీతో జట్టుకట్టి.. మా ఆశలను నిలువునా కూల్చేశారు

ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో పెట్టామన్నారు. జనాభా లెక్కల్లో బీసీల గణన చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. బీసీలకు సమన్యాయం జరగాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశమని విజయసాయిరెడ్డి అన్నారు.

బీసీలంతా జగన్‌తోనే.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం
స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, బీసీలను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్‌ అని,  అనేక సంక్షేమ పథకాలను ఆయన తెచ్చారని అన్నారు. డెహ్రాడూన్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో జరిగిన స్పీకర్ల మీటింగ్‌లోనూ సీఎం జగన్ గురించే చర్చ జరిగిందని స్పీకర్‌ గుర్తు చేశారు. బీసీల కోసం అన్ని పథకాలను ఎలా అమలు చేస్తున్నారని మిగతా రాష్ట్రాల వారు తనను అడిగారని తెలిపారు. దేశంలోనే ఒక ట్రెండ్‌ను సీఎం జగన్‌ సెట్ చేశారు. అలాంటి వ్యక్తికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఆయన వలనే మన పిల్లల భవిష్యత్తు తరాలు బాగుంటాయి. జగన్‌కి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. బీసీలంతా జగన్‌తోనే పొత్తు పెట్టుకున్నారు’’ అని స్పీకర్‌ అన్నారు.

బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు: ఆర్‌ కృష్ణయ్య
బీసీల జీవితాల్లో వెలుగులు తెచ్చేలాంటి పథకాలను సీఎం జగన్ తెచ్చారని ఎంపీ, బీసీల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీ ముఖ్యమంత్రులు సైతం బీసీల కోసం ఇన్ని పనులు చేయలేదు. 56 కార్పోరేషన్లు తెచ్చి అందరికీ గుర్తింపు ఇచ్చారు. జగన్.. బీసీల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. జగన్ వలనే దేశ వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. జగన్ మాత్రమే బీసీల బిల్లు పెట్టించారు. బీసీల మీద జగన్‌కి ఉన్న నిజమైన చిత్తశుద్దికి నిదర్శనమని కృష్ణయ్య అన్నారు.

జగన్‌కు అండగా నిలవాలి: మంత్రి సీదిరి

చంద్రబాబుకి కుల అహంకారం ఉందని, కానీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే సామాజిక న్యాయం జరుగుతోందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు కుల అహంకారంతో మాట్లాడతాడు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లెటర్ రాశాడు. మత్స్య కారులను తోకలు కత్తిరిస్తానన్నాడు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. ఇలా ప్రతి విషయంలోనూ కుల అహంకారంతో మాట్లాడతాడు. పరిశ్రమలు వస్తుంటే ఆపాలని చూశారు. బీసీల హాస్టళ్లు చంద్రబాబు హయాంలో ఎలా వున్నాయో చూశాం. మన పిల్లల భవిష్యత్తు గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. కానీ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం జరుగుతోంది. కాబట్టి, జగన్ కి అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.


బీసీలంతా జగన్ వెంటే.. : మంత్రి ఉషశ్రీ 

సంక్షేమ పథకాలనేవి అధికంగా బీసీలకు ఉపయోగ పడుతున్నాయి. కానీ ఆ పథకాలను ఆపేయమని చంద్రబాబు అంటున్నారు. అలాంటి వ్యక్తి నైజాన్ని మనం ప్రజల దృష్టి కి తీసుకెళ్లాలి అని మంత్రి ఉషశ్రీ చరణ్  పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బీసీల జిల్లా. ఇప్పుడు ఆ బీసీలంతా జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను జగన్ ఇచ్చారు. అన్ని కులాలకు పెద్దన్నగా జగన్ నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేశారు. ఐనాసరే జగన్ ఇంకా ఏమేమి చేయాలా అని ఆలోచిస్తున్నారని మంత్రి ఉషశ్రీ పేర్కొన్నారు.


చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు

మనందరి తల రాతలు మార్చిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానంటూ గతంలో బెదిరించారు. కానీ, సీఎం జగన్ మాత్రం నా బీసీలు అంటూ ఆప్యాయంగా సంభోధిస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు  అదే చిహ్నం అని ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు.

బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాలి
బీసీ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 139 కులాలతో బీసీలు ఉన్నారు. అందరూ ఏకతాటి మీద నిలబడాలి. ఐకమత్యంతో ఉంటేనే ఏవైనా పనులు సాధించవచ్చు. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలనే డిమాండ్ చేయటం వలన ప్రయోజనం ఉండదు. చట్టసభల్లో కూడా 50% మహిళకు అవకాశం కల్పించేలా బిల్లు తేవాలి అని విజయసాయిరెడ్డి మాట్లాడారు. బీసీల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. కార్పొరేషన్‌ పదవుల్లో బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు