YSR Bus Yatra: శ్రీకాకుళం నుంచి ఏపీ మంత్రుల బస్సుయాత్ర

26 May, 2022 16:41 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ‘‘దేశానికి ఇండిపెండెన్స్‌ రాక ముందు నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయి. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్ ఒక్కరే చేయగలిగారు. ఇలా చేయమని సీఎం జగన్‌కు ఎవరూ అడగలేదు.. ఆయనే స్వతహాగా అవకాశం కల్పించారు. 

ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. వాళ్ళకి పంచి పెడితే దానిని కొందరు హేళన చూస్తున్నారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే. గతంలో నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పనిలేదు. సీఎం జగన్ వాళ్ళ ఇంటికే పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగాడు. కానీ, మేము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా?. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. 

ఈ వర్గాల వారిని సీఎం జగన్‌ సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేశారు. దానికి సజీవ సాక్ష్యంగా నిలబడాలి అనే బస్సు యాత్ర చేస్తున్నాం. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం.. అవన్నీ ప్రజలకు చెప్తాము. ఈరోజు దేశానికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని పంపారు’’ అని తెలిపారు.

అనంతరం, పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్. ఆ వర్గాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశమంతా చూస్తోంది. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నాము’’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు

మరిన్ని వార్తలు