మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు

28 May, 2022 21:47 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు.

బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు: మంత్రి అంబటి
టీడీపీ మహానాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్‌. బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదు. టీడీపీది మహానాడు కాదు.. ఏడుపునాడు మాత్రమేనని’’ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దు: మంత్రి మేరుగ
రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నడైనా సాయం చేశారా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు చేశారన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ నాయకత్వంలో సుపరిపాలన జరుగుతోందన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. చంద్రబాబు కుయుక్తులను నమ్మొద్దని ప్రజలకు మంత్రి మేరుగ నాగార్జున విజ్ఞప్తి చేశారు.

సింగిల్‌గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తాం: అంజాద్‌ బాషా
అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా వస్తాం.. విజయ ఢంకా మోగిస్తామని అంజాద్‌ బాషా అన్నారు.

జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు: మంత్రి వేణుగోపాలకృష్ణ
సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక విప్లవకారుడిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు నినాదం కావాలని మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు.

లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు: మంత్రి ధర్మాన
బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ప్రతి లబ్ధిదారు ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయి. మూడేళ్లలోనే 90 శాతంపైగా హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారన్నారు. నాడు-నేడు ద్వారా గ్రామాల్లో పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించేలా సీఎం జగన్‌ పరిపాలన చేస్తున్నారన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

ప్రజల్లో నమ్మకం కోల్పోయి ఫ్రస్టేషన్‌లో  చంద్రబాబు: విడదల రజిని
టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోరుకునే నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయి చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారని విడదల రజిని ఎద్దేవా చేశారు.

సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
సామాజిక న్యాయం సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. బలహీన వర్గాలకు రాజకీయం అవకాశం కల్పించిన నాయకుడు సీఎం జగన్‌. ఆయన నాయకత్వాన్ని బలపర్చాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

వారిని వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది: జోగి రమేష్‌
బలహీన వర్గాలను వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ కూడా అంతుచూస్తామంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఓడిస్తానంటున్న లోకేష్‌.. ముందు ఎమ్మెల్యేగా గెలవాలని హితవు పలికారు. బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. 80 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి కట్టుగా ఉన్నారన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. పొత్తులు పెట్టుకున్నా, పొర్లు దండాలు పెట్టినా చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు.

సామాజిక న్యాయం ఘనత సీఎం జగన్‌దే: రాజన్నదొర
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం తథ్యమని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలబడాలన్నారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు.

బస్సు యాత్ర స్పందన చూసి చంద్రబాబుకు వణుకు: సీదిరి అప్పలరాజు
బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబుకు వణుకు పుట్టిందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల క్షేమం కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. దళితులను ఘోరంగా అవమానించిన చరిత్ర చంద్రబాబుదని.. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన: ఆదిమూలపు
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పరిపాలిస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. టీడీపీ హయాంలో బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. టీడీపీ హయాంలో గిరిజన, మైనారిటీ శాఖలకు మంత్రులు కూడా లేని పరిస్థితి అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు