YSRCP Bus Yatra: జయహో జగనిజం

24 May, 2022 12:39 IST|Sakshi

నిజాలు చెప్పేందుకే బస్సు యాత్ర

చంద్రబాబుది అబద్ధాల పర్యటన

మంత్రి మేరుగ నాగార్జున స్పష్టీకరణ

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌):  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతూ పర్యటిస్తున్నారని.. వైఎస్సార్‌ సీపీ మాత్రం నిజాలు చెప్పేందుకే బస్సుయాత్రకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. బహుజనులకు చేకూరిన ప్రయోజనాన్ని ప్రజలందరికీ చాటిచెప్పేందుకు సామాజిక న్యాయభేరి–జయహో జగనన్న నినాదంతో ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టామని, దీనిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కార్యాలయంలో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు అధ్యక్షతన సోమవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్సుయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లలోనే సామాజిక విప్లవం సృష్టించారని, ఇది దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. బాబూజగ్జీవన్‌రాం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, పెరియార్‌ రామస్వామి, జ్యోతీరావుపూలే, అబుల్‌ కలాం ఆజాద్, కొమరం భీమ్‌ వంటి మహామహుల ఆలోచనలను సీఎం ఆచరించి చూపుతున్నారని కొనియాడారు. దీనిని సహించలేక ప్రతిపక్షం ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తోందని మేరుగ మండిపడ్డారు. ప్రతిపక్షం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నంలో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.   

బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. బస్సు యాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు జరుగుతాయని వివరించారు. వక్ఫ్‌ బోర్డు చైర్మన్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా,  పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ సీఎం జగన్‌ ఒక అభినవ పూలే, ఒక అభినవ అంబేడ్కర్‌ అని కొనియాడారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, పలు కార్పొరేషన్ల చైర్మన్లు చిల్లపల్లి మోహనరావు, షేక్‌ ఆసిఫ్, కాకుమాను రాజశేఖర్‌ పాల్గొన్నారు.  

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా మూడేళ్ళు నిండుతుందని, ఈ మూడేళ్లలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి ఆయన చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ బస్సుయాత్ర ద్వారా సామాజిక భేరీ మోగిస్తున్నట్లు తెలిపారు. 26న శ్రీకాకుళంలో మొదలయ్యే ఈ బస్సుయాత్ర 28వ తేదీ మధ్యాహ్నానికి గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వివరించారు. 

మరిన్ని వార్తలు