మా జెండా.. అజెండా.. ప్రజా సంక్షేమమే 

31 May, 2022 13:30 IST|Sakshi

సంక్షేమ పాలనకు మూడేళ్లు

వాడవాడలా రెపరెపలాడిన వైఎస్సార్‌సీపీ జెండా

సామాజిక సేవా కార్యక్రమాలతో వేడుకలు

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉత్సాహంగా సంబరాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు టౌన్‌: దుష్ట పాలనకు చరమగీతం పాడేందుకు.. జనం కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఆనాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. ప్రజాభీష్టంతో విజయభేరి మోగించి అధికారం చేపట్టారు. చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకుని విజయగర్జనతో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. పాలన తొలిరోజు నుంచే ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ నూరుశాతం అమలుకు శ్రమిస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 130కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సంక్షేమ పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో వాడవాడలా వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, శ్రేణులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు దుస్తుల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, కేక్‌ కటింగ్‌లతో వేడుకలు జరుపుకున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లాలో ఇలా.. 

నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్‌ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొని కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు.  
భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ స్థానిక పార్టీ కార్యాయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ వేసి వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరవాసరం మండలంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.  

పాలకొల్లు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, నాయకులు గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనంద ప్రకాష్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  

ఉండి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి గోకరాజు రామరాజు కాళ్ల మండలం పెద అమిరం గ్రామంలో దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.  

ఆచంట నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్‌ సుంకర ఇందిర, పెనుగొండ సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షురాలు దండు పద్మావతి, నాయకులు చిన్నం రామిరెడ్డి, దంపనబోయిన బాబూరావు తదితరులు కేక్‌ కట్‌ చేశారు.

తణుకు నియోజకవర్గంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. వృద్ధాశ్రమంలో భోజన వసతి కల్పించారు. పేదలకు పండ్లు, వస్త్రాలు పంపిణీ చేశారు.    

తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతాల్లో స్థానిక నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమిల్లి విజయానందరెడ్డి, 
పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.     

ఏలూరు జిల్లాలో ఇలా.. 

 పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెం మండలంలో మూడేళ్ల పండుగ చేసుకున్నారు. అన్ని మండలాల్లో మండల కన్వీనర్లు, నేతలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.  
కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సంత మార్కెట్‌ వద్ద భారీ కేక్‌ కట్‌ చేశారు. దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
చింతలపూడి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఘనంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  
దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు ప్రారంభించారు. నాలుగు మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్‌ కటింగ్‌లు చేశారు.  
 ఉంగుటూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ స్థానిక నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేపట్టారు.  
నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు పట్టణంలో చినగాంధీ బొమ్మ సెంటరులో కేక్‌ కట్‌ చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, పార్టీ నేతలు హాజరయ్యారు.  
 ద్వారకాతిరుమల మండలం నారాయణపురంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేక్‌ కట్‌ చేసి సంబరాలను ప్రారంభించారు. ఎంపీపీ బొండాడ మోహిని, జెడ్పీటీసీ చిగురుపల్లి శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.  
ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నేతలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ జాతీయ నాయకుడు పొలిమేర హరికృష్ణ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.   

మరిన్ని వార్తలు