పవన్‌ కంటే కేఏ పాల్‌ నయం

14 Jan, 2023 08:17 IST|Sakshi

సాక్షి, తాడిపత్రి: ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక విష పురుగులా తయారయ్యారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య  విమర్శించారు. శుక్రవారం తాడిపత్రిలోని పైలా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలపై సరైన అవగాహన లేని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఎంతో నయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణ చేయనిది పవన్‌కు నిద్రపట్టని పరిస్థితి నెలకొందన్నారు.

తన స్వార్థం కోసం జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పవన్‌ ఉన్మాదిలా తయారవుతున్నారన్నారు. చెప్పులతో కొట్టండి.. దాడులు చేయండి ..జైలుకు వెళ్లండి.. ప్రాణ త్యాగాలు చేయండి అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి చేస్తున్న వాఖ్యలు తమలోని బజారు రౌడీని బయటకు తెస్తున్నాయన్నారు. అమాయక ప్రజలు, సినిమా అభిమానులను, కార్యకర్తలు, యువతను పెడదోవ పట్టించి తన పబ్బం గడుపుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కోసం కాపు కులాన్ని, అభిమానులను అడ్డం పెట్టుకొని ఉన్మాదిలా తయారైన పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పోరాడాను అంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్‌ వ్యాఖ్యలను చూస్తుంటే పిచ్చి ముదిరి పాకాన పడినట్లుందని, ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటాడో, ఎప్పుడు విడిపోతాడో, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. జనసేన పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర తాకట్టు పెట్టిన పవన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేరును ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు.

సొంతంగా పార్టీని స్థాపించి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ఒంటి చేత్తో గెలిపించిన ముఖ్యమంత్రి కాలిగోటికి కూడా పవన్‌కళ్యాణ్‌ సరిపోడని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కలిసి వచ్చినా, గుంపులుగా వచ్చినా, పవన్‌కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. అదే సమయంలో ప్రజలు మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని జోస్యం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి పనులపై అందరూ సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

(చదవండి: టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్‌     )

మరిన్ని వార్తలు