YSRCP Rajya Sabha Candidates: వైఎస్సార్‌సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

18 May, 2022 03:32 IST|Sakshi

పెద్దల సభకు బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు

విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం

సుప్రీంకోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి చాన్స్‌

ముఖ్య నేతలతో చర్చించి ఖరారు చేసిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్‌ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.

సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్‌ జగన్‌ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

బీసీలకు సముచిత స్థానం: బొత్స 
అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.

నామినేటెడ్‌ పదవులతోపాటు నామినేషన్‌ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్‌ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. 

బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌: సజ్జల 
బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు.

రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే..
1.ర్యాగ కృష్ణయ్య
పుట్టిన తేదీ: సెప్టెంబర్‌ 13, 1954
విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్‌ఎల్‌ఎం (గోల్డ్‌ మెడల్‌)
సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్‌పేట మండలం, వికారాబాద్‌ జిల్లా, తెలంగాణ
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు.
► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు.
► 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

2. వేణుంబాక విజయసాయిరెడ్డి
పుట్టిన తేదీ: జూలై 1, 1957
సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
విద్యార్హతలు: చార్టర్డ్‌ అకౌంటెంట్‌
పదవులు: 
► ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.
► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు.
► వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్‌ 22 నుంచి 2022 జూన్‌ 21 వరకు)కు ఎంపికయ్యారు.
► వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 
► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.
► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. 

3. బీద మస్తాన్‌రావు
పుట్టిన తేదీ: జూలై 2, 1958
సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ  
కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్‌)
► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు.
► చెన్నైలో ప్రముఖ హోటల్‌ గ్రూప్‌లో ఫైనాన్షియల్‌ మేనేజర్‌గా పనిచేశారు.
► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు.
► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు.
► బోగోల్‌ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 
► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 
► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజధాని డెవలప్‌మెంట్‌ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. 
► 2019లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
► 2019 డిసెంబర్‌లో వైఎస్సార్‌సీపీలో చేరారు.
► బీఎంఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 
► కోవిడ్‌ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్‌ కోసం జిల్లా కలెక్టర్‌కు విరాళం ఇచ్చారు.
► 1998లో యూనివర్సిటీ ఆఫ్‌ కాంటెంపరరీ స్టడీస్‌ వాషింగ్టన్, యూఎస్‌ఏ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

4. నిరంజన్‌రెడ్డి
పుట్టిన తేదీ: జూలై 22, 1970
సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లా, తెలంగాణ
విద్యార్హతలు: హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్‌లో న్యాయ విద్యను అభ్యసించారు.
► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 
► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.
► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 
► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.
► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్‌ సీనియర్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు.  

>
మరిన్ని వార్తలు